భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్లు జరిగేది అప్పుడే : నవజోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు

భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్లు జరిగేది అప్పుడే : నవజోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు

చిరకాల ప్రత్యర్తులైన ఇండియా, పాకిస్తాన్ మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ లు ఎప్పుడు అనేది క్రికెట్ అభిమానుల నుంచి తరచుగా వస్తున్న ప్రశ్న. ఇరు జట్లు ఆడుతుంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా భావించే పరిస్థితులు స్టేడియంలో కనిపిస్తుంటాయి. అయితే సిరీస్ లు ఎప్పుడు అనే ప్రశ్నకు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

 దుబాయ్‌లో జరుగుతున్న డీపీ వరల్డ్ ఐఎల్ టీ20 లీగ్‌లో కామెంటేటర్‌గా ఉన్న సిద్ధూ ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై స్పందించిన సిద్ధూ..  ఇది పూర్తిగా రాజకీయ అంశమని అన్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని చెప్పారు. 

భారత్, పాకిస్తాన్ జట్లు 2012-13 నుంచి ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. అయితే ఐసీసీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీల్లో తటస్థ వేదికలపై తలపడుతున్నాయి.

గత ఏడాది పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులతో కలిపి 26 మంది చనిపోయారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను భారత ప్రభుత్వం నిషేధించింది. 

 రాజకీయ విషయాలు రాజకీయాలే. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నికైంది. వారు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కు అని నేను భావిస్తున్నాను అని సిద్ధూ చెప్పారు. ఒకవేళ భద్రత లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ లు వద్దని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తే దాన్ని గౌరవించాలని సిద్ధూ పేర్కొన్నారు.

 దూరాన్ని తగ్గించే క్రికెట్ దౌత్యం

భారత్, పాకిస్తాన్ మధ్య దూరాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తే అప్పుడు క్రికెట్‌ను ఒక సాధనంగా వాడుకోవచ్చని సిద్ధూ అభిప్రాయపడ్డారు. సమయం సరైనదని అనిపించినప్పుడు ప్రభుత్వం ఇందుకు పచ్చజెండా ఊపుతుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం

ఐపీఎల్ కారణంగా ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం పెరిగిందని సిద్ధూ అన్నారు. గతంలో భారతీయులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ ఆడేవారని, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియన్ లీగ్ ఆడేందుకు భారత్ వస్తోందని చెప్పారు. అంతర్జాతీయ ఆటగాళ్లు, అత్యుత్తమ కోచ్‌లతో కలిసి ఆడటం వల్ల భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని వివరించారు.

 మా రోజుల్లో మేం పాటియాలా నుంచి వచ్చేవాళ్లం. అప్పుడు మాకు ఇతర దేశాల ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నామనే భావన ఉండేది కాదు. కానీ ఇప్పుడు భారత కుర్రాళ్లకు ఆ భయం లేదు. ప్రపంచంలోని మేటి ఆటగాళ్లతో వారు కలిసి పని చేస్తున్నారు. క్రికెట్ 70 శాతం మానసిక దృఢత్వంపైనే ఆధారపడి ఉంటుంది' అని సిద్ధూ అన్నారు.

టెస్టులు, వన్డేల కంటే టీ20లకు ఆదరణ పెరగడంపై

టెస్టులు, వన్డేల కంటే టీ20లకు ఆదరణ పెరగడంపై సిద్ధూ స్పందిస్తూ.. ఇదంతా మార్కెట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రజలు ఏది కోరుకుంటే అది జరుగుతుందని, అయితే దీని వల్ల వన్డే క్రికెట్‌ను విస్మరించడం లేదని తెలిపారు. వాణిజ్యపరంగా ఏది లాభదాయకమైతే దానికి ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించారు. ఐఎల్ టీ20 లాంటి కొత్త లీగ్‌లతో క్రికెట్‌ను విస్తరిస్తున్న పాలకులను సిద్ధూ అభినందించారు.