పెళ్లి ఊరేగింపులు, బరాత్ లలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు పోలీసులు. కత్తులతో, ఇతర మారణాయుధాలతో డ్యాన్స్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు పెడతామని హెచ్చరించారు. రీసెంట్ గా హైదరాబాద్ లో కత్తులతో డ్యాన్స్ చేస్తూ నానా హంగామా సృష్టించిన నలుగురిపై కేసులు నమోదయిన విషయాన్ని వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ బరాత్ ఊరేగింపులో కత్తులు ప్రదర్శించిన నలుగురు వ్యక్తులను 2026 నవంబర్ 25న అరెస్ట్ చేశారు. నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వివాహ బరాత్ ఊరేగింపు సందర్భంగా నలుగురు వ్యక్తులు కత్తులు చేతబట్టి, బహిరంగంగా ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుడిమల్కాపూర్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా ఈ ఘటన 22-11-2026 తేదీన రాత్రి సుమారు 9:00 గంటలకు రెతిబౌలిలోని షాలిమార్ స్వీట్ హౌస్ వెనుక ఉన్న బాబు జగ్జీవన్ రావు భవన్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన వివాహ వేడుకలో చోటుచేసుకున్నట్లు గుర్తించారు.
తమ సోదరి వివాహం సందర్భంగా నిర్వహించిన బరాత్ ఊరేగింపులో నలుగురు వ్యక్తులు కత్తులు చేతబట్టి, ప్రజల మధ్య బహిరంగంగా ప్రదర్శిస్తూ, వాటిని ఊపుతూ డ్యాన్స్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ చర్యల వల్ల అక్కడ ఉన్న ప్రజల్లో భయాందోళనలు కలగడమే కాకుండా, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
బరాత్ లో కత్తులు ప్రదర్శించిన వ్యక్తులు కె. శ్రవణ్ కుమార్ ( 31), కుశంగల సంజయ్ కుమార్ (29 ), కుశంగల సందీప్ కుమార్( 28), కుశంగల దిలీప్ కుమార్ (26 )గా పోలీసులు గుర్తించారు. వీరందరూ రెతిబౌలి, దిల్షాద్ నగర్ కాలనీ, గుడిమల్కాపూర్, హైదరాబాద్ నివాసితులుగా పేర్కొన్నారు.
వివాహ వేడుకలు, బరాత్ ఊరేగింపులు, ఇతర బహిరంగ కార్యక్రమాల్లో కత్తులు లేదా ఇతర మారణాయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడం చేయరాదని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. వివాహ వేడుకల నిర్వాహకులు, ఈవెంట్ మేనేజర్లు శాంతిభద్రతలకు భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆయుధాలతో ప్రమాదకరమైన విన్యాసాలు, డ్యాన్సులు చేయరాదని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలు, యువతకు ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించాలని కోరారు.
ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
