జ్వరం వచ్చిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. వైద్యం వికటించి బాలిక మృతి..

జ్వరం వచ్చిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. వైద్యం వికటించి బాలిక మృతి..

సూర్యాపేట జిల్లాలో ఘోరం జరిగింది. జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే.. వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రపోడు తండాలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గుర్రపోడు తండాకు చెందిన ప్రమీల అనే బాలిక నకిరేకల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. 

గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న క్రమంలో.. ప్రమీలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. ప్రమీలను ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ కోసం పక్క గ్రామం అయిన పెదవీడులో ఆర్ఎంపీ డాక్టర్ షరీఫ్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలికకు గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్ తమ్ముడు మోహన్ పాషా.

ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ప్రమీల పరిస్థితి విషమించడంతో హుజూర్నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ప్రమీల పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది ప్రమీల. బాలిక మృతితో కనీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనతో గుర్రపోడు తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.