గ్రీన్ వాటర్ ట్యాంకర్లలో డ్రైనేజీ నీళ్లా.. CMC సీరియస్.. శేరిలింగంపల్లి సర్కిల్ మేనేజర్ సస్పెండ్

గ్రీన్ వాటర్ ట్యాంకర్లలో డ్రైనేజీ నీళ్లా.. CMC సీరియస్.. శేరిలింగంపల్లి సర్కిల్ మేనేజర్ సస్పెండ్

హైదరాబాద్: గ్రీన్ వాటర్ ట్యాంకర్లలో డ్రైనేజీ నీటి సరఫరాపై CMC (సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) సీరియస్ అయింది. శేరిలింగంపల్లి సర్కిల్ మేనేజర్ విక్రమ్ చంద్రను సస్పెండ్ చేశారు. నార్సింగి, పటాన్‌చెరు సర్కిళ్ల ఇన్‌చార్జ్‌గా కూడా విక్రమ్ చంద్ర విధుల్లో ఉన్నారు. అవుట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్ గోపాల్‌పై చర్యలు తీసుకున్నారు.

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ రద్దు చేశారు. ఖాజాగూడలో డ్రైనేజీ నుంచి సేకరించిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రీన్ ట్యాంకర్ల ద్వారా కేవలం STP ట్రీటెడ్ వాటర్ మాత్రమే సరఫరా చేయాలని CMC ఆదేశించిన సంగతి తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని CMC హెచ్చరించింది. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణపై పర్యవేక్షణ మరింత పెంచాలని నిర్ణయించింది.

గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఖాజాగూడలో నాలా నుంచి నేరుగా మురుగు నీటిని ట్యాంకర్లలో  నిర్వాహకులు నింపుతున్న వీడియోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో CMC ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే నాలా నీటిని ట్యాంకర్లలోకి ఎక్కిస్తున్న వీడియోలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్, నిర్మాణ అవసరాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగు నీటిని వినియోగించాలన్న లక్ష్యంతో గ్రీన్ ట్యాంకర్లను ప్రారంభించారు. నవంబర్ 1న గ్రీన్ ట్యాంకర్ల సేవలను జలమండలి ప్రారంభించింది. శుద్ధి చేయని మురుగు నీటిని నిర్మాణాలు, గార్డెనింగ్‌కు వినియోగిస్తే ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉంది.