జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ సపోర్ట్.. ఎన్విడియా సీఈఓగా రిఎంట్రీ పై హాట్ కామెంట్స్ !

జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ సపోర్ట్.. ఎన్విడియా సీఈఓగా రిఎంట్రీ పై హాట్ కామెంట్స్ !

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు టెక్ దిగ్గజం, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సపోర్ట్ గా నిలిచారు. ఇటీవల చోటుచేసుకున్న ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ నాయకత్వంపై చర్చ జరుగుతుండగా.. ఆయనకు మద్దతుగా ఎలోన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు, హువాంగ్‌తో ఎలోన్ మస్క్ ప్రత్యేకంగా సమావేశం కావడం కూడా చర్చనీయాంశమైంది.

ఈ సమావేశానికి ఎలోన్  మస్క్ తన ఇద్దరు పిల్లలను కూడా వెంట తీసుకువచ్చారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను BEP రీసెర్చ్ వ్యవస్థాపకుడు, ఎన్విడియా షేర్ హోల్డర్ బెన్ పౌలాడియన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫొటోలను కూడా ఆయన పోస్టు చేశారు.

జెన్సన్‌కు మద్దతుగా నిలిచిన బెన్ పౌలాడియన్
ఎన్విడియాలో ఎంతోకాలంగా పెట్టుబడులు పెట్టిన బెన్ పౌలాడియన్ కూడా జెన్సన్ హువాంగ్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. కంపెనీకి జెన్సన్ నాయకత్వం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2016లో తాను తొలిసారిగా ఎన్విడియా షేర్లు కొనుగోలు చేసినట్లు పౌలాడియన్ తెలిపారు. అప్పటి నుంచి కంపెనీ ఎదుగుదలను దగ్గరగా గమనిస్తున్నానని చెప్పారు. షేర్ ధరలు తగ్గినప్పుడు మరిన్ని షేర్లు కొనుగోలు చేశానని వెల్లడించారు.

ఎన్విడియాకు జెన్సన్ హువాంగ్ కేవలం సీఈఓ మాత్రమే కాదని, ఆ కంపెనీకి ఆయనే అసలైన బలమని పౌలాడియన్ అభిప్రాయపడ్డారు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వంటి కీలక అంశాలన్నీ ఆయన నాయకత్వంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జెన్సన్ లేకుండా ఎన్విడియా ఎలా ముందుకు వెళ్తుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా కష్టమేనని అన్నారు. ఆయన స్థానంలో మరొకరిని తీసుకొచ్చినంత మాత్రాన కంపెనీపై ఉన్న అంచనాలు, వ్యాపార సంబంధాలు అలాగే కొనసాగుతాయని భావించడం సరికాదని వ్యాఖ్యానించారు.

అందుకే జెన్సన్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ 'స్టాండ్ విత్ జెన్సన్' పేరుతో మద్దతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎన్విడియా బోర్డు సభ్యులకు కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు. జెన్సన్ తిరిగి కంపెనీలోకి వచ్చినప్పుడు ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారని పౌలాడియన్ చెప్పారు. రెండో అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపిన జెన్సన్.. ఈసారి మరింత మెరుగైన సీఈఓగా పనిచేస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

'తప్పును సరిదిద్దారు'.. ఎలోన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈఓగా బాధ్యతలు చేపట్టడంపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జెన్సన్‌ను తిరిగి సీఈఓగా నియమించడం ద్వారా జరిగిన తప్పును సరిదిద్దారని ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. ఆయన తిరిగి రావడం సరైన నిర్ణయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్విడియా బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించడం సరైన నిర్ణయమని అభివర్ణించారు.

అంతేకాదు, హువాంగ్‌ను గొప్ప దేశభక్తుడిగా, అమెరికాకు ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా ట్రంప్ పేర్కొన్నారు. ఎన్విడియా అభివృద్ధితో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే జెన్సన్ నాయకత్వం అవసరమని పోస్టులో రాశారు.

డిసెంబర్‌లో అమెరికా కాంగ్రెస్ ముందు హాజరు
ఇదిలా ఉంటే, జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకోనుంది. ఆయన డిసెంబర్ 1న అమెరికా ప్రతినిధుల సభకు చెందిన విదేశీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, చైనా అంశాల కమిటీల ముందు రహస్య విచారణకు హాజరుకానున్నారు. అలాగే డిసెంబర్ 3న సెనేట్ బ్యాంకింగ్ కమిటీ సభ్యుల ముందు బహిరంగ విచారణకు హాజరవుతారని సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ నాయకత్వం, ఎన్విడియా భవిష్యత్తు, అమెరికా ఏఐ రంగంలో కంపెనీ పాత్రపై ఆసక్తి నెలకొంది. అయితే ఎన్విడియా వంటి ప్రపంచ స్థాయి టెక్ కంపెనీకి జెన్సన్ హువాంగ్ నాయకత్వం ఎంత ముఖ్యమో ఎలోన్ మస్క్, ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు తెచ్చాయి. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించిన విచారణ అంశాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.