భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ పందిని పెంచుకోవడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డివోర్స్ తర్వాత మహిళ చేసిన కామెంట్స్ ఒక పెద్ద డిబేట్ కు దారితీశాయి. విడాకులు తీసుకుంటే తీసుకుంది కానీ.. అంత మాట అనాలా..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్ల బంధానికి ముగింపు పలికిన భార్య పందిని ఎందుకు దత్తత తీసుకుంది.. ఆమె చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్ విల్ కు చెందిన గేలా థాంప్సన్ అనే 33 ఏళ్ల మహిళ భర్తతో విడాకుల తర్వాత పందిపిల్లలను పెంచుకోవడం మొదలెట్టారు. నవంబర్ 2025లో తన విడాకులు ఖరారైన వెంటనే ఆమె ఎనిమిది వారాల వయసున్న డైసీ అనే పందిపిల్లను దత్తత తీసుకున్నారు. తన మాజీ భర్త పందిని పెంచుకోవడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదని, అందుకే కొత్త జీవితాన్ని తనకు నచ్చిన విధంగా ప్రారంభించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గేలా చెప్పారు.
మాజీ భర్త ఎప్పుడూ పందిని వద్దనేవారని, అందుకే విడాకుల తర్వాత తన కలను నెరవేర్చుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకున్నట్లు గేలా న్యూయార్క్ పోస్ట్ తో చెప్పారు.
ఈ సందర్భంగా మహిళ చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి దారితీశాయి. ఒక పందికి బదులు మరో పందిని తెచ్చుకున్నానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సరదాగా అన్నవే అయినా.. పందితో పోల్చడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా విడాకుల తదుపరి జీవితం ఉండాలని కోరుతున్నారు.
ఇక దత్తత తీసుకున్న సమయంలో 9 పౌండ్ల బరువున్న డైసీ, ఇప్పుడు 50 పౌండ్ల వరకు పెరిగింది. గేలా తన ఇంట్లోనే డైసీని ఉంచుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా బెడ్, బొమ్మలు, లిట్టర్ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు.
డైసీని తనతో పాటు బయటకు కూడా తీసుకువెళ్తానని గేలా చెప్పారు. దగ్గరలోని పెట్ స్టోర్లకు, సోనిక్ వంటి షాపులకు వెళ్లేటప్పుడు షాపు సిబ్బంది దీనికి తినుబండారాలు ఇస్తుంటారని తెలిపారు. ఇంట్లోని క్యాబినెట్లను తెరవడం డైసీ నేర్చుకోవడంతో ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని గేలా వెల్లడించారు. డైసీ ఆహారం, ఇతర ఖర్చుల కోసం చలికాలంలో నెలకు సుమారు 50 డాలర్లు ఖర్చవుతోందని చెప్పారు. దీని కోసం బయట ప్రత్యేకంగా ఒక పెన్ను నిర్మించాక ఖర్చులు తగ్గే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారు.
గేలా ప్రస్తుత భాగస్వామి కూడా ఈ విషయంలో మద్దతు ఇస్తున్నారు. ఆయన తన పొలానికి డైసీని తీసుకువెళుతుంటారని గేలా చెప్పారు. వారు డ్యూడ్ అనే మరో పందిని కూడా దత్తత తీసుకున్నారు. భవిష్యత్తులో కోళ్లు, గాడిదలతో ఒక చిన్న హాబీ ఫామ్ ఏర్పాటు చేయాలని గేలా థాంప్సన్ ప్లాన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి జంతువులను రక్షించడం, పెంచడం తనకు ఇష్టమని ఆమె తెలిపారు. ఇది తన కల అని, ఇప్పుడు దాన్ని నెరవేర్చుకుంటున్నానని గేలా చెప్పారు.
