ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం...

ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం...

ఏపీలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థలకు గురువారం ( నవంబర్ 26 ) ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కూడా పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు పునేఠా. 

ఈ ఎన్నికల్లో 4 మేయర్, 19 చైర్‌పర్సన్ పదవులకు మొత్తం 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,010 వార్డు సభ్యుల స్థానాలకు గాను 41 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 5 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. మిగిలిన 964 వార్డు స్థానాలకు మొత్తం 2,968 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

24.98 లక్షల మంది ఓటర్లు 

ఎన్నికలు జరిగే 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 24 లక్షల 98వేల 312 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 12లక్షల 04వేల 819 మంది పురుషులు, 12లక్షల 93వేల 84 మంది మహిళలు, 409 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.

 2వేల 801 పోలింగ్ కేంద్రాలు

ఈ ఎన్నికల కోసం మొత్తం 2,801 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, 2,698 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో 819 కేంద్రాలను సెన్సిటివ్‌గా, 597 కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా గుర్తించి, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 5,602 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, భయభ్రాంతులకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు పునేఠా.