సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..

సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..

కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 19న సముద్రంలో గల్లంతయ్యారని  ప్రకటించారు కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కోస్ట్‌గార్డ్ అధికారులకు తెలియజేసిందని అన్నారు.

గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారని... ఆ తరువాత వారు ఫోన్ ద్వారా గానీ, ట్రాన్స్‌పాండర్ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదని తెలిపారు. మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం అందిన వెంటనే కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు.

కోస్ట్ గార్డ్, నేవి అధికారుల సంయుక్త గాలింపు:

గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. యుద్ధ నౌకలు, హెలికాప్టర్లతో సముద్రం లో నిరంతరాయంగా గాలింపు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులతో కూడా పంచుకున్నట్లు తెలిపారు.

గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తారని... వారి ఆచూకీ లభించే వరకు సంబంధిత అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలను కొనసాగించనున్నట్లు తెలిపారు కలెక్టర్.