హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన పరిష్కారమని ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ (TfL) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ సూచించారు. మెట్రో రైలు విస్తరణతో పాటు బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచాలని, ఫుట్‌పాత్‌లను వెడల్పు చేయాలని అభిప్రాయపడ్డారు. కేవలం రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై బుధవారం (2026 నవంబర్ 25) హైదరాబాద్ మెట్రో రైల్ భవన్లో ప్రత్యేక చర్చాగోష్టి నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శశి వర్మ లండన్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు.
హైదరాబాద్‌లో దారుణంగా తగ్గిన ప్రజా రవాణా
హైదరాబాద్‌లో ఒకప్పుడు 40 శాతానికి పైగా ఉన్న ప్రజా రవాణా వినియోగం ప్రస్తుతం 28 శాతానికి పడిపోయిందని శశి వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాటాను తిరిగి కనీసం 40 శాతానికి పెంచాలని, ఆ తర్వాత 60 శాతానికి పైగా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడకుండా మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణా సాధనాలను వినియోగించేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఇందుకోసం మెట్రో విస్తరణతో పాటు బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణతోనే సమస్య పరిష్కారం కాదు
నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ జనసాంద్రత, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతాయని, దాంతో ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా అధికమవుతుందని శశి వర్మ వివరించారు.
సిటీల్లో రోడ్ల వెడల్పును పెంచడం అంత సులభం కాదని, పైగా అది ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థలోనే ఉందన్నారు.
ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి
మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచాలని సూచించారు. ఇందుకోసం బస్సుల సంఖ్య పెంచడంతో పాటు వెడల్పైన ఫుట్‌పాత్‌లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
తక్కువ ఖర్చుతో కూడిన ప్రజా రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఎక్కువ మంది ప్రజలు వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణా వైపు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రైవేటు వాహనాల వినియోగంపై అవసరమైన నియంత్రణ చర్యలు కూడా చేపట్టాలని సూచించారు.
లండన్‌లో 14 రవాణా సంస్థల ఏకీకరణతో TfL ఏర్పాటు
లండన్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడానికి చేపట్టిన సంస్కరణలను శశి వర్మ వివరించారు. 2000 సంవత్సరంలో రైలు, రోడ్డు, అండర్‌గ్రౌండ్ మెట్రో, బస్సులు, సబర్బన్ రైలు వంటి వివిధ రవాణా విభాగాలకు చెందిన 14 సంస్థలను ఏకీకృతం చేసి ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ (TfL) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే విస్తృత అధికారాలు కలిగిన లండన్ మేయర్ వ్యవస్థ కూడా రవాణా రంగంలో సమన్వయానికి దోహదపడిందని వివరించారు. వివిధ రవాణా వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన విధానాలను అమలు చేయగలిగారని పేర్కొన్నారు.
నగరాల అభివృద్ధితోనే ఆర్థిక ప్రగతి
నగరాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలకు ప్రధాన చోదకశక్తులని శశి వర్మ అన్నారు. సిటీల్లో జనసాంద్రతను ప్రొడక్టివిటీ పెంచేలా వినియోగించుకోవడంతో పాటు, ట్రాఫిక్, కాలుష్య సమస్యలు పెరగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి అధిక ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని, ఆర్థిక, ఆర్థికేతర చర్యలతో పాటు అవసరమైన విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అనేక చర్యలు అమలు చేస్తున్నారని, ఇండియన్ సిటీస్ లో కూడా ఇలాంటి విధానాల ఆవశ్యకత ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్, రవాణా రంగ పరిశోధకుడు డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, UMTA ఎండీ జీవన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్, రవాణా రంగాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
