తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కొరడా ఝళిపించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్, పెండింగ్ నిర్మాణ పనుల పూర్తి, రీఫండ్లు, వడ్డీ చెల్లింపులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రెరా నమోదు లేకుండా ప్రీ లాంచ్ ప్రకటనలు చేసిన సంస్థలపైనా చర్యలు తీసుకుంది.
ఏలియన్స్ డెవలపర్స్‌కు రూ.2 కోట్ల జరిమానా
రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండానే కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏలియన్స్ డెవలపర్స్‌కు తెలంగాణ రెరా ఏకంగా రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఏడు రోజుల్లోగా కొనుగోలుదారులకు సేల్ అగ్రిమెంట్లు అందించాలని ఆదేశించింది.
అలాగే, అనుమతుల్లో లేని సదుపాయాలను ఉన్నట్లు ప్రచారం చేసిన అక్షిత ఇన్ఫ్రాకు రూ.10.06 లక్షల జరిమానా విధించింది. సేల్ అగ్రిమెంట్ లేకుండా రూ.12 లక్షలు వసూలు చేసిన ఈఎల్వీ డెవలపర్స్‌కు రూ.3.20 లక్షల జరిమానా విధించింది.
ఆలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రూ.17.42 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కొంపల్లిలోని భారతి బిల్డర్స్ ఇద్దరు కొనుగోలుదారులకు రూ.9.30 లక్షల చొప్పున తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.
ఫ్లాట్ల అప్పగింతలో జాప్యంపై వడ్డీ చెల్లించాల్సిందే !
ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేసిన పలు సంస్థలకు రెరా కీలక ఆదేశాలు జారీ చేసింది. వాసవి రియల్టర్స్‌కు సంబంధించి రూ.33.60 లక్షలు, రూ.44.80 లక్షల మొత్తాలపై 10.85 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఆలస్యమైన ఫ్లాట్ల అప్పగింతకు పరిహారంగా కూడా పలు సంస్థలు 10.85 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.
భువన్‌తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) పొందాలని, ఓసీ వచ్చిన 60 రోజుల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాలని ఆదేశించింది.
ఈఎల్వీ కాస్మోపాలిస్ ప్రాజెక్టులో ఆరు నెలల్లో పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించింది. ట్రూ ప్రైడ్ బాచారం లేఅవుట్లో 60 రోజుల్లో విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. శ్రీ సూర్య డెవలపర్స్, టీఎన్ఆర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ తమ సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
నానక్‌రామ్‌గూడ ఎంపైర్ అర్బానా ప్రాజెక్టులో మిగిలిన రూ.లక్షను 30 రోజుల్లో తిరిగి చెల్లించాలని, మారం గార్లపాటి హోమ్స్‌లో కొనుగోలుదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఇక అర్బన్‌రైజ్ బిల్డర్స్‌తో కొనుగోలుదారుల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమైంది. కొనుగోలుదారులకు రూ.41.94 లక్షలు రీఫండ్ చేసేందుకు సంస్థ అంగీకరించింది.
రెరా నమోదు లేకుండా ప్రీ లాంచ్ ప్రకటనలు.. ఆరో రియాల్టీకి రూ.25 లక్షల ఫైన్
రెరా సుమోటో విచారణలోనూ పలు సంస్థల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రాజెక్టుల ప్రకటనలు, ప్రీ లాంచ్ ప్రచారాలు చేసిన సంస్థలపై అథారిటీ చర్యలు తీసుకుంది.
కొండాపూర్‌లోని ఆరో సఫైర్ ప్రాజెక్టుకు రెరా నమోదు లేకుండానే డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించిన ఆరో రియాల్టీకి రూ.25 లక్షల జరిమానా విధించింది. సుమారు 8 ఎకరాల్లో నాలుగు టవర్లతో, 1,300కు పైగా ఫ్లాట్లు నిర్మించనున్నట్లు, ఫ్లాట్ల ధరలు రూ.2 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం చేసినట్లు గుర్తించింది.
ప్రీ లాంచ్ పేరుతో రెరా నిబంధనల నుంచి తప్పించుకోలేరని అథారిటీ స్పష్టం చేసింది. 30 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
రెరా నమోదు లేకుండా ప్రాజెక్టుల ప్రకటనలు చేసిన జనప్రియ టౌన్‌షిప్స్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. చందానగర్‌లోని బహితి, సైనిక్‌పురిలోని ఆల్టెయిర్ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు లేకుండానే ప్రచారం నిర్వహించినట్లు గుర్తించింది. నైల్ వ్యాలీ, లేక్ ఫ్రంట్, సితార ప్రాజెక్టుల ప్రకటనల్లోనూ రెరా రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించలేదని పేర్కొంది.
సంబంధిత ప్రాజెక్టులకు రెరా నమోదు లభించే వరకు ప్రకటనలు, బుకింగ్‌లు, అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
కోర్టు కేసుల వివరాలు దాచిన జీకేహెచ్ ప్రాపర్టీస్‌కు జరిమానా
భూమికి సంబంధించిన పెండింగ్ కోర్టు కేసుల వివరాలను వెల్లడించని జీకేహెచ్ ప్రాపర్టీస్‌కు రూ.6.10 లక్షల జరిమానా విధించింది. కాప్రాలోని జీకేస్ ప్రవిష్ అబోడ్ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ సమయంలో పెండింగ్ సివిల్ కేసుల వివరాలను వెల్లడించలేదని రెరా నిర్ధారించింది.
ప్రాజెక్టు పూర్తయినా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చినా గతంలో చేసిన ఉల్లంఘనలకు మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
వెస్ట్రన్ విండ్సర్ పార్క్‌పై కీలక ఆదేశాలు
పుప్పాలగూడలోని వెస్ట్రన్ విండ్సర్ పార్క్ ప్రాజెక్టుపైనా తెలంగాణ రెరా విచారణ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ కోర్టు కేసులు, న్యాయస్థానాల ఉత్తర్వుల పూర్తి వివరాలను 30 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలను విడివిడిగా వెల్లడించాలని స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టుపై చేపట్టిన సుమోటో విచారణను రెరా ముగించింది. అయితే ఎలాంటి జరిమానా విధించలేదు. విచారణ ముగింపు అంటే భూమి యాజమాన్య హక్కులకు లేదా ఆక్రమణలకు ఆమోదం తెలిపినట్లు కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో తప్పుడు సమాచారం ఇచ్చినా, కీలక వివరాలను దాచిపెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొనుగోలుదారులకు రెరా హెచ్చరిక.. బిల్డర్లకు స్పష్టమైన సందేశం !
మొత్తంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనల ఉల్లంఘనలపై రెరా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. సేల్ అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు వసూలు చేయడం, అనుమతులు లేని సదుపాయాలపై ప్రకటనలు ఇవ్వడం, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీ లాంచ్ ప్రచారాలు నిర్వహించడం, కోర్టు కేసుల వివరాలు దాచిపెట్టడం వంటి అంశాలపై చర్యలు తీసుకుంది.
కొనుగోలుదారులకు రీఫండ్లు, వడ్డీ చెల్లింపులు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్, పెండింగ్ పనుల పూర్తి వంటి అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసినట్లయింది.
