బతికుండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్.. సూర్యాపేట జిల్లాలో ఇద్దరు అధికారులు సస్పెండ్

 బతికుండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్.. సూర్యాపేట జిల్లాలో ఇద్దరు అధికారులు సస్పెండ్

ప్రభుత్వ రికార్డుల్లో బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపించి, ఆయనకు చెందిన భూమిని అక్రమంగా ఇతరుల పేరుపై బదలాయించిన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెన్షన్ వేటు వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్యతండాకు చెందిన లాకావత్ హేమ్లా నాయక్‌కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆయన బతికుండగానే మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆ భూమిని ఆయన కుమారుడి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

లోన్ కోసం బ్యాంకుకు వెళ్లడంతో వెలుగులోకి అక్రమం

హేమ్లా నాయక్ తన వ్యవసాయ అవసరాల కోసం పంట రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించే క్రమంలో తన పేరు మీద భూమి లేకపోవడం, మరణించినట్లు రికార్డుల్లో నమోదు కావడం ఆయనను విస్మయానికి గురిచేసింది.

దీంతో ఈ అక్రమ వ్యవహారంపై అధికారులకు సమాచారం అందింది. సంబంధిత అధికారులు విచారణ చేపట్టగా, నకిలీ డెత్ సర్టిఫికెట్ ఆధారంగా పట్టా మార్పిడి జరిగినట్లు నిర్ధారణ అయింది.

 తహశీల్దార్, హెల్త్ అసిస్టెంట్ సస్పెన్షన్

ఈ వ్యవహారంపై విచారణలో అక్రమ పట్టా మార్పిడి జరిగినట్లు తేలడంతో తుంగతుర్తి మండల తహశీల్దార్ దయానందం, హెల్త్ అసిస్టెంట్ యాదగిరిపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ 2026 నవంబర్ 25న ఉత్తర్వులు జారీ చేశారు.