లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మొదలైంది. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఆరు నెలల ముందే హామీలతో ప్రచారం మొదలుపెట్టేసింది. ఫస్ట్ రెండు హామీలే అదిరిపోయే విధంగా ఉన్నాయి. ఈ రెండు హామీలతో ఇప్పుడు అందరి దృష్టి అఖిలేష్ యాదవ్ పై పడింది..
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ ‘జన మన్’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సత్తాయిస్ కా సంకల్ప: పీడీఏ కా ప్రాణపత్ర’ నినాదంతో రూపొందించిన ఈ మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులు, పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యువత, ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘విజన్ ఇండియా’ చర్చల ఆధారంగా ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
మహిళలు, యువతకు ప్రాధాన్యం
మహిళా ఓటర్ల కోసం మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు. మహిళలకు ఏటా రూ. 40 వేల పెన్షన్‌తో పాటు స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. యువత కోసం విద్యార్థులకు మెట్రోలో ఉచిత ప్రయాణం, పేపర్ లీక్ లను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకువస్తామని ఎస్పీ పేర్కొంది. 12వ తరగతి పాసైన విద్యార్థులకు ఉచిత లాప్ టాప్ ల పంపిణీని చేయనున్నట్లు పేర్కొంది.
సామాజిక న్యాయం, ఉచిత విద్యుత్
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్త కుల గణన చేపడతామని మేనిఫెస్టోలో వెల్లడించారు. గృహ అవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పేదలకు రూ. 2 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ‘యశ్ భారతి సమ్మాన్’ పురస్కారాన్ని మళ్ళీ ప్రారంభించి, ఎంపికైన వారికి నెలకు రూ. లక్ష గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ అంశాన్ని కూడా ఇందులో చేర్చారు.
వ్యవసాయం, పరిశ్రమలకు ఊరట
రైతులకు రుణమాఫీ, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం, చెరకు రైతులకు సకాలంలో బకాయిల చెల్లింపు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఆలోక్ రంజన్ నేతృత్వంలో ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
ALSO READ : అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ టీమ్.. రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలు వైరల్
జిల్లాకో మేనిఫెస్టో
జనవరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకు వేర్వేరుగా మేనిఫెస్టోలను విడుదల చేయాలని ఎస్పీ నిర్ణయించింది. లక్నో నగరం కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో ఉండనుంది. వివిధ వర్గాల ప్రజలకు పార్టీ హామీలను వివరంగా వివరించేందుకు ఈ దశలవారీ విధానాన్ని అనుసరిస్తున్నట్లు సీనియర్ నాయకులు తెలిపారు. ప్రస్తుతం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో బీజేపీకి 258, ఎస్పీకి 107 స్థానాలు ఉన్నాయి. వరుసగా మూడోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ, ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
