స్టాక్ మార్కెట్లో ఒక వింత పరిస్థితి ఇన్వెస్టర్లను తలలు పట్టుకునేలా చేస్తోంది. ఒకవైపు నిఫ్టీ 26 వేల మార్కును తాకుతూ దూసుకెళ్తోంది.. మరోవైపు స్మాల్ క్యాప్స్ రికార్డు స్థాయిలో లాభాలు ప్రకటిస్తున్నాయి. అయినా సరే స్మాల్ క్యాప్స్ మాత్రం కుప్పకూలుతున్నాయి. గత 7 వారాల్లో నిఫ్టీ 16 శాతానికి పైగా పెరిగినప్పటికీ.. 900కి పైగా స్మాల్‌క్యాప్ షేర్లు ఏకంగా 45 శాతం వరకు నష్టపోయి ఇన్వెస్టర్ల జేబులకు చిల్లు పెట్టాయి. కంపెనీల లాభాలకు, షేర్ల ధరలకు మధ్య ఈ భారీ తేడా ఎందుకు వస్తోందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలను మించి స్మాల్‌క్యాప్ కంపెనీలు అదరగొట్టాయి. స్మాల్‌క్యాప్ కంపెనీల నికర లాభం ఏకంగా 36.8 శాతం పెరిగిందని ఎలారా సెక్యూరిటీస్ వెల్లడించింది. మోతీలాల్ ఓస్వాల్ నివేదికలోనూ ఇవి 32 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయినప్పటికీ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 25 మధ్య ఎంపవర్ ఇండియా 45%, స్టెర్లైట్ టెక్నాలజీస్ 42%, జెనిసిస్ ఇంటర్నేషనల్ 41% మేర నష్టపోయాయి. శాంతి గోల్డ్, ఇ-ముద్ర, వార్డ్‌విజార్డ్, మోర్పెన్ ల్యాబ్స్, ఆర్ఆర్ కేబుల్, హెచ్ఎఫ్సీఎల్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ వంటి పాపులర్ షేర్లు సైతం 30 నుంచి 39 శాతం వరకు నష్టపోయాయి.
ఈ వింత పరిస్థితికి ప్రధాన కారణం లాభాల్లోని అసమానతలే. స్మాల్‌క్యాప్ విభాగంలో కనిపించిన మొత్తం లాభాల వృద్ధిలో దాదాపు 75 శాతం కేవలం ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాల నుంచే వచ్చింది. మెటల్స్, ఫైనాన్షియల్ రంగాల కంపెనీల లాభాల అంచనాలకు కోత పడింది. దీనికితోడు గత ఏడాది ఇదే సమయంలో లాభాలు కేవలం 6 శాతమే ఉండటంతో.. ఈసారి వృద్ధి శాతం ఎక్కువగా కనిపిస్తోంది తప్ప అన్ని కంపెనీలు అద్భుతంగా రాణించడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు నవంబర్‌లో భారత మార్కెట్లోకి తిరిగొచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వేల కోట్ల పెట్టుబడులను కేవలం సురక్షితమైన లార్జ్‌క్యాప్ షేర్లలోనే పెడుతున్నారు. అందుకే నెల రోజుల్లో నిఫ్టీ 10 శాతం పెరిగితే, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ కనీసం అర శాతం కూడా పైకి కదల్లేదు.
ALSO READ : ఎన్విడియా షేర్లలో ట్రంప్ భారీ ట్రేడింగ్..
దీనికితోడు స్మాల్‌క్యాప్ షేర్ల వాల్యుయేషన్లు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉండటంతో ఫండ్ మేనేజర్లు లార్జ్‌క్యాప్ షేర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే కంపెనీలు లాభాలు ప్రకటించినా.. వాటి భవిష్యత్తు వృద్ధిపై అనుమానాలతో ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ షేర్లను అమ్మేస్తున్నారు. కేవలం 2 రంగాలకే పరిమితమైన ఈ లాభాల జోరు అన్ని రంగాలకు విస్తరిస్తేనే.. స్మాల్‌క్యాప్ షేర్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
