టాటా గ్రూప్‌లో ముదిరిన వివాదం.. హైకోర్టుకు టాటా ట్రస్ట్స్, రూ.65 కోట్ల నష్టపరిహారం డిమాండ్!

టాటా గ్రూప్‌లో ముదిరిన వివాదం.. హైకోర్టుకు టాటా ట్రస్ట్స్, రూ.65 కోట్ల నష్టపరిహారం డిమాండ్!

టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రీఅపాయింట్మెంట్ సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్  కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా తమకు కలిగిన నష్టానికి గాను మొత్తం రూ.65 కోట్ల డ్యామేజెస్ అంటే నష్టపరిహారం చెల్లించాలని ఈ రెండు ట్రస్టులు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయంపై నోయెల్ టాటా కూడా బాంబే హైకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో.. 2027 ఫిబ్రవరి 21 నుంచి మరో ఐదేళ్ల పాటు చంద్రశేఖరన్‌ను ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ తీర్మానానికి ట్రస్ట్ ఛైర్మన్ నోయెల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్లే, భాస్కర్ భట్ మద్దతు ఇచ్చారు. అయితే మరో ఇద్దరు డైరెక్టర్లు విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్ దీనిని వ్యతిరేకించారు.

ఆ తర్వాత ఆర్టికల్ 104B కింద జరిగిన మరో ఓటింగ్‌లో నోయెల్ టాటా వ్యతిరేకించగా.. వేణు శ్రీనివాసన్ అనుకూలంగా ఓటేశారు. దీంతో బోర్డు సమావేశానికి అధ్యక్షత వహించిన హరీష్ మన్వానీ తన 'కాస్టింగ్ ఓటు' ఉపయోగించి చంద్రశేఖరన్ నియామకానికి ఆమోదం తెలిపారు.

అయితే కంపెనీ నిబంధనలలోని ఆర్టికల్ 121 ప్రకారం ట్రస్ట్ డైరెక్టర్లందరి ఆమోదం లేకుండా తీర్మానం చేయడం చెల్లదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ట్రస్టులు వాదిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని భావించి, తమ హక్కులను కాపాడుకునేందుకు అత్యవసరంగా బాంబే హైకోర్టుకు వెళ్లాలని ట్రస్టులు తీర్మానించాయి.

ఈ వివాదంలో భాగంగా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ రూ.50 కోట్లు, ఆర్‌డీ టాటా ట్రస్ట్ రూ.15 కోట్లు కలిపి మొత్తం రూ. 65 కోట్ల నష్టపరిహారం కోరాయి. కేసు వేసిన రోజు నుంచి డబ్బు చెల్లించే వరకు ఏడాదికి 18 శాతం వడ్డీతో సహా ఇప్పించాలని కోర్టును కోరనున్నాయి. మరోవైపు తమ నిర్ణయం నిబంధనల ప్రకారమే జరిగిందని టాటా సన్స్ స్పష్టం చేస్తోంది. నవంబర్ 30న జరగబోయే బోర్డు సమావేశానికి ముందు ఈ పరిణామం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.