మిస్టరీ, మైథాలజీ, అడ్వెంచర్.. ఇలా అన్ని అంశాలను కలగలిపి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ‘వృషకర్మ’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఆసక్తికరమైన కథాంశం, దర్శకుడు కార్తీక్ వర్మ దండు స్టోరీ టెల్లింగ్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఓ మిస్టరీని దాచిపెడుతూ, నెక్స్ట్ ఏం జరగబోతోందనే క్యూరియాసిటీని పెంచిన తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘విరూపాక్ష’తో తన టేకింగ్‌తో మెప్పించిన కార్తీక్ దండు.. ఈసారి నాగచైతన్యతో మరో ఇంట్రెస్టింగ్ సినిమాను అందించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
మిస్టరీ, నిధి వేటతో ఆసక్తికరంగా..
నిధి వేట, పురాతన చరిత్ర, అంతుచిక్కని ప్రపంచం, ప్రళయం వంటి ఆసక్తికరమైన అంశాలను దర్శకుడు ఈ కథలో మిళితం చేసినట్లు తెలుస్తోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగచైతన్య 'అర్జున్' అనే ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నారు. పురాతన నిధి అన్వేషణలో భాగంగా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ, అంతుచిక్కని రహస్యాలను ఛేదించే సాహసికుడిగా ఆయన పాత్ర ఉండబోతోంది. యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో నాగచైతన్య లుక్, పాత్ర చిత్రణ కొత్తగా ఉండనున్నాయి.
ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి చౌదరి..
మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో 'దక్ష' అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. ప్రాచీన చరిత్ర, పురాతన ఆనవాళ్ల వెనుక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయాణంలో ఆమె పాత్ర కీలకంగా ఉండనుంది. నాగచైతన్యతో కలిసి ఆమె చేసే అన్వేషణ కథను ఎలాంటి మలుపులు తిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది.
విలన్గా 'లాపతా లేడీస్' ఫేమ్
'లాపతా లేడీస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ చిత్రంలో విలన్గా కనిపించనున్నారు. ఆయన పాత్ర కూడా మిస్టరీతో కూడుకున్నట్లు ట్రైలర్‌లోని సన్నివేశాలు సూచిస్తున్నాయి. హీరో, విలన్ మధ్య సాగే సంఘర్షణ కథలో కీలకంగా ఉండే అవకాశముంది.
మొత్తానికి 'వృషకర్మ' నాగచైతన్య కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. 'విరూపాక్ష'తో ప్రేక్షకులను మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్లిన కార్తీక్ వర్మ దండు.. ఈసారి నాగచైతన్యతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. మరి ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన 'వృషకర్మ' వెండితెరపై ఎలాంటి అనుభూతిని అందిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే!
