ప్రణబ్ సూచనతోనే బీజేపీలోకి..బెంగాల్ సీఎం సువేందు అధికారి

ప్రణబ్ సూచనతోనే బీజేపీలోకి..బెంగాల్ సీఎం సువేందు అధికారి

కోల్‌‌‌‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ప్రధాని మోదీతో తాను కలిసి నడవడానికి దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సలహాయే కారణమని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి వెల్లడించారు. కోల్‌‌‌‌కతాలో జరిగిన ‘ది ఎకనామిక్ టైమ్స్ బెంగాల్ అసెండ్స్’ సదస్సులో ఆయన ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రణబ్ ముఖర్జీని తన అసలైన సలహాదారుగా సువేందు అభివర్ణించారు. ఆయన రాష్ట్రపతి అయ్యాక తాను రాష్ట్రపతి భవన్‌‌‌‌కు వెళ్లి కలిసినప్పుడు ఈ సంభాషణ జరిగిందన్నారు. ‘ఒక ఉద్యోగిలా మిగిలిపోవాలనుకుంటే ఇక్కడే (టీఎంసీలో) ఉండు. సొంతంగా ఎదగాలనుకుంటే మోదీతో కలిసి నడువు అని ప్రణబ్ జీ నాకు చెప్పారు’ అని సువేందు గుర్తుచేశారు. మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీని ఓ ప్రైవేట్ కంపెనీలా నడిపారని, అక్కడ ఉద్యోగిలా ఉండడం ఇష్టం లేకే పార్టీని వీడానని చెప్పారు. ప్రణబ్​ ఇప్పుడు మన మధ్య లేనందున ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడి వివాదాలు సృష్టించదలచుకోలేదని స్పష్టం చేశారు.

ఆరెస్సెస్‌‌‌‌తో ప్రణబ్‌‌‌‌కు సత్సంబంధాలు

ప్రణబ్ ముఖర్జీకి బీజేపీ, ఆరెస్సెస్‌‌‌‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2018లో నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లోని ఆరెస్సెస్ సభలో పాల్గొని హెడ్గేవార్‌‌‌‌ను ‘భరతమాత ముద్దుబిడ్డ’గా కొనియాడారు. మోదీ గుజరాత్ సీఎం కాకముందు నుంచే ప్రణబ్‌‌‌‌తో పరిచయం ఉండేదని ఆయన కుమార్తె శర్మిష్ట గతంలో తెలిపారు. ఇటీవల సోనియా గాంధీ రాసిన పుస్తకంలో 2010లో ప్రణబ్ ప్రధాని పదవిపై ఆశపడ్డారని పేర్కొనడంపై కూడా శర్మిష్ట తీవ్రంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలతో కాకుండా, కష్టపడి ఆయన ఎదిగారని కౌంటర్ ఇచ్చారు. కాగా, 2020 డిసెంబర్‌‌‌‌లో బీజేపీలో చేరిన సువేందు.. 2026 ఎన్నికల్లో 207 సీట్లతో బీజేపీని గెలిపించి, భవానీపూర్‌‌‌‌లో మమతను ఓడించి బెంగాల్ సీఎంగా పగ్గాలు చేపట్టారు.