న్యూఢిల్లీ: దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఆహార నాణ్యతను పెంచేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో అందించే తరహాలో తక్కువ ఐటమ్స్‌తో, అత్యుత్తమ క్వాలిటీ ఫుడ్‌ను అందించే దిశగా అడుగులు వేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 3 వందే భారత్ స్లీపర్ రైళ్లలో కుదించిన కొత్త మెనూను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది.
రైళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు చెక్ పెట్టేందుకే ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం ముంబై–బెంగళూరు, హౌరా–కామాఖ్య, న్యూఢిల్లీ–వారణాసి వందే భారత్ స్లీపర్ రూట్లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. కాగా, ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఆహారాన్ని రైల్వే లేదా పాత క్యాటరింగ్ కాంట్రాక్టర్లు కాకుండా, ప్రముఖ క్లౌడ్ కిచెన్లు తయారు చేస్తున్నాయి.
