వైభవ్ విధ్వంసం కొనసాగేనా? ఇవాళ (నవంబర్26) శ్రీలంక–ఎతో ఇండియా–ఎ సెమీస్ మ్యాచ్

వైభవ్ విధ్వంసం కొనసాగేనా? ఇవాళ (నవంబర్26) శ్రీలంక–ఎతో ఇండియా–ఎ సెమీస్ మ్యాచ్
  • తిలక్‌‌, అభిషేక్‌‌ శర్మపై  కూడా దృష్టి
  •  మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

దోహా: వైభవ్‌‌ సూర్యవంశీ.. ప్రస్తుతం వరల్డ్‌‌ క్రికెట్‌‌లో పెను విధ్వంసం సృష్టిస్తున్న ఈ వండర్‌‌ కిడ్‌‌.. ఆసియా కప్‌‌ రైజింగ్‌‌ స్టార్స్‌‌లో కీలక పోరుకు రెడీ అయ్యాడు. గురువారం శ్రీలంక–ఎతో జరిగే సెమీఫైనల్‌‌ మ్యాచ్‌‌లో మరోసారి తన సిక్సర్ల సునామీని రిపీట్‌‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. దాంతో వైభవ్‌‌ను ఎలాగైనా ఆపాలని లంకేయులు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. యూఏఈపై డబుల్‌‌ సెంచరీలతో రికార్డులు కొల్లగొట్టిన సూర్యవంశీపైనే ఇప్పుడు ఎక్కువ దృష్టి నెలకొంది. పాకిస్తాన్‌‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌తో టోర్నీలో టీమిండియాకు బలమైన పునరాగమనాన్ని అందించాడు. దాంతో వరల్డ్‌‌ క్రికెట్‌‌ మొత్తం ఈ మ్యాచ్‌‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

బౌలర్లూ రాణిస్తే..

టోర్నీ ప్రారంభ మ్యాచ్‌‌లో నేపాల్‌‌ను 26 రన్స్‌‌కే ఆలౌట్‌‌ చేసిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాతి మ్యాచ్‌‌ల్లో పట్టు కోల్పోయారు. పాక్‌‌.. ఇండియాపై 300 రన్స్‌‌ చేయడంతో పాటు 48 పరుగులతో విజయం సాధించింది. ఇందులో బౌలింగ్‌‌ వైఫల్యమే ప్రధానంగా కనిపించింది. యూఏఈ కూడా 249/8 స్కోరు చేసింది. ఇక్కడా బౌలర్లు విఫలమయ్యారు. కాబట్టి లంకతో మ్యాచ్‌‌లో బౌలర్లు కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. పేసర్లు ప్రిన్స్‌‌ యాదవ్‌‌, హర్షిత్‌‌ రాణా చెరో ఏడు వికెట్లు తీసినా.. నియంత్రణతో కూడిన బౌలింగ్‌‌తో రన్స్‌‌ను కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది. 

బ్యాటింగ్‌‌లో ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌‌పై సూర్యవంశీ చెలరేగి ఆడాడు. దాంతో మిడిలార్డర్‌‌కు కాస్త బలాన్నిచ్చింది. అయితే ఆయుష్‌‌ బదోనీ ఫామ్‌‌ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు అతను ఆడిన ఇన్నింగ్స్‌‌ల్లో 2, 0 రన్స్‌‌ మాత్రమే చేశాడు. రింకూ సింగ్‌‌ కూడా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 9, 6, 21 రన్స్‌‌కే పరిమితమయ్యాడు. దాంతో ప్రధానంగా కెప్టెన్‌‌ తిలక్‌‌ వర్మపై ఎక్కువగా భారం పడుతోంది. ఓపెనింగ్‌‌లో అభిషేక్‌‌ శర్మ కూడా బ్యాట్‌‌ ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. 

లంక కూడా దీటుగా..

లంక జట్టులోనూ స్టార్‌‌ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇంకా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదు. కాబట్టి సెమీస్‌‌లో లంకను ఎదుర్కోవడం ఇండియాకు సవాలే. అదే టైమ్‌‌లో లంక, పాకిస్తాన్‌‌ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌‌కు చేరుకున్నాయి. నిషాన్‌‌ మధుష్క, లసిత్‌‌ క్రూస్‌‌పుల్లె, కెప్టెన్‌‌ పవన్‌‌ రత్నాయకే బ్యాటింగ్‌‌లో నిలకడగా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. వనుజ సహన్‌‌ నియంత్రణ లంకకు కీలకమైన అంశంగా మారనుంది. మిగతా బ్యాటర్లు, బౌలర్లు కూడా రాణిస్తే లంక కూడా దీటుగా జవాబిచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌‌గా వైభవ్‌‌ను అడ్డుకుంటేనే లంకేయులు విజయాన్ని ఆశించొచ్చు.