- ఖాజాగూడ ఘటనతో నాణ్యతపై అనుమానాలు
- క్వాలిటీ రిపోర్టులు బయటపెడితేనే వాడతామంటున్న నిర్మాణ సంస్థలు
- క్రెడాయ్‌తో జలమండలి వరుస భేటీలు
- గ్రీన్ ట్యాంకర్లలోకి నాలా నీళ్ల ఘటన
- సర్కిల్ మేనేజర్ సస్పెన్షన్
- సూపర్‌వైజర్‌పై చర్యలు
- కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ రద్దు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల పథకం ఆశించిన లక్ష్యాన్ని చేరడం లేదు. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మురుగునీటిని నిర్మాణ రంగం, గార్డెనింగ్ అవసరాలకు వాడాలని సూచిస్తూ కార్యక్రమం చేపట్టగా..నీటి నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖాజాగూడ నాలాలోని మురుగునీటిని గ్రీన్ ట్యాంకర్లలో నింపి సరఫరా చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో నీటి నాణ్యతపై నిర్మాణ రంగానికి చెందిన బిల్డర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు కూడా నిర్మాణ అవసరాలకు తగిన ప్రమాణాలతో ఉండడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతపై స్పష్టత లేకుండా భవన నిర్మాణాలకు ఎలా వాడతామని ప్రశ్నిస్తున్నారు.
సారీ..రిస్క్తీసుకోలేం..
నగరంలో భారీ భవనాలు నిర్మిస్తున్నామని, ఇలాంటి నిర్మాణాల్లో నీటి నాణ్యత విషయంలో రాజీ పడలేమని బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిలో క్లోరిన్, ఇతర కెమికల్స్థాయిలు నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుందంటున్నారు.
క్లోరిన్ వల్ల నిర్మాణాల్లోని స్టీల్ తుప్పు పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల పాటు ఉండాల్సిన భవనాల విషయంలో నాణ్యతపై స్పష్టత లేని నీటిని వాడి రిస్క్ తీసుకోలేమని అంటున్నారు.
థర్డ్ పార్టీతో పరీక్షలు చేయించాలి
గేటెడ్ కమ్యూనిటీల్లోని ప్రైవేట్ ఎస్టీపీల్లోనూ మురుగునీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తున్నారా లేదా అన్న సందేహాలు ఉన్నాయని బిల్డర్లు అంటున్నారు. ఎస్టీపీ నిర్వాహకులు ఇచ్చే నివేదికలపైనే ఆధారపడకుండా థర్డ్ పార్టీ సంస్థలతో నీటిని పరీక్షించాలని కోరుతున్నారు.
ప్రతి ప్లాంట్‌కు సంబంధించిన రోజువారీ నాణ్యత నివేదికలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్, బీఓడీ, టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ వంటి ప్రమాణాల వివరాలు వెల్లడిస్తేనే గ్రీన్ ట్యాంకర్ల నీటిని వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
క్రెడాయ్‌తో వరుస సమావేశాలు
నిర్మాణ రంగంలో ఎస్టీపీ నీటినే వినియోగించేలా చూడాలని జలమండలి క్రెడాయ్ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన నీటినే సరఫరా చేస్తామని హామీ ఇస్తోంది. నీటి నాణ్యత వివరాలను ఆన్‌లైన్‌తో పాటు ఎస్టీపీల వద్ద డిజిటల్ డిస్‌ప్లేలపై ప్రదర్శిస్తున్నామని గ్రీన్ ట్యాంకర్ల నోడల్ ఆఫీసర్లు వివరిస్తున్నారు.
అన్ని పారామీటర్లు సరిగ్గా ఉన్న నీటినే సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. అయినా నాణ్యతపై పూర్తి భరోసా వచ్చే వరకు వినియోగానికి ముందుకు రాలేమని క్రెడాయ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు వాడాలని చెప్తుంటే.. నాణ్యత నివేదికలు లేకుండా ఎలా వాడుతామని నిర్మాణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
భరోసా కల్పించాల్సిందే...
భూగర్భ జలాలు అడుగంటుతున్న టైంలో శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అవసరమే. అయితే, గ్రీన్ ట్యాంకర్లలోకి నీటిని ఎక్కడి నుంచి నింపుతున్నారు? ఎస్టీపీల్లో పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తున్నారా? నిర్మాణ అవసరాలకు తగిన నాణ్యత ఉందా? అన్నది అధికారులు పర్యవేక్షించాలి. ట్యాంకర్ల సంఖ్య పెంచడం కంటే నాణ్యమైన నీటిని సరఫరా చేయడం, థర్డ్ పార్టీ నివేదికలను అందుబాటులో ఉంచి బిల్డర్లలో నమ్మకం కల్పించడం ముఖ్యం. అప్పుడే గ్రీన్ వాటర్ ట్యాంకర్ల పథకం లక్ష్యం నెరవేరుతుంది.
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటికి బదులుగా ఖాజాగూడ నాలా నుంచి డ్రైనేజీ నీటిని సరఫరా చేస్తున్న వ్యవహారంపై వీ6 వెలుగులో వచ్చిన కథనానికి సీఎంసీ అధికారులు స్పందించారు.
ఈ అవకతవకలను తీవ్రంగా పరిగణించి సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్ మేనేజర్, నార్సింగి, పటాన్‌చెరు సర్కిళ్ల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న విక్రమ్ చంద్రను సస్పెండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్ గోపాల్‌పైనా చర్యలు చేపట్టారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు జారీ చేసిన వర్క్ ఆర్డర్‌ను సైతం రద్దు చేశారు.
