హైదరాబాద్, వెలుగు: జాతీయ దగ్గు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రచారంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా 29,188 మంది డాక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. రబ్బరు స్టాంపుల వీడియో ఆల్బమ్ విభాగంలో ఈ రికార్డు నమోదైంది. ‘ఐ సపోర్ట్ నేషనల్ కఫ్ డే' అనే సందేశం ఉన్న ప్రత్యేక రబ్బరు స్టాంపును డాక్టర్లు దగ్గు చికిత్సకు సంబంధించిన మార్గదర్శక పత్రంపై ముద్రించారు. వీరంతా ఈ ప్రక్రియను వీడియోలుగా చిత్రీకరించి ప్రచారంలో భాగంగా పంపించారు. వీటితోనే గిన్నిస్ రికార్డు సాధించారు. దగ్గు రకాలను గుర్తించడం, వాటికి గల కారణాలను పరీక్షించడం, తగిన చికిత్స ప్రారంభించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
