తల్లికి బంగారం కొనివ్వాలని.. సైబర్ వలలో చిక్కాడు.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా..

తల్లికి బంగారం కొనివ్వాలని.. సైబర్ వలలో చిక్కాడు.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా..
  • బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యలో ట్విస్ట్
  • జువెలరీ స్కీమ్​లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన సంపత్ 
  • టెలిగ్రామ్ యాప్​తో ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు

నిర్మల్, వెలుగు: తల్లికి బంగారం కొనివ్వాలని అనుకున్న  ఓ విద్యార్థి.. సైబర్ నేరగాళ్ల బారిన పడి చివరకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్లా సంపత్ కుమార్ సైబర్ మోసగాళ్ల వలకు చిక్కి మూడు రోజుల కిందట సూసైడ్​ చేసుకున్నాడు. 

అయితే అందుకు బెట్టింగ్ కారణమంటూ మొదట ప్రచారం జరిగింది. సంపత్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లోని చాటింగ్, యాప్ లను  పోలీసులు విశ్లేషించడంతో ఆత్మహత్యకు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల బుధవారం వివరాలు వెల్లడించారు. 

మూడు నెలల క్రితం సంపత్ జువెలరీ స్కీంలో పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ. 5 వేల లాభాన్ని పొందాడు. సైబర్ మోసగాళ్లు టెలిగ్రామ్ యాప్ ద్వారా అతనికి ఓ ఇన్వెస్ట్మెంట్ యాప్ లింక్​పంపి, పదింతల లాభాల ఆశ చూపి డౌన్‌‌లోడ్ చేసుకునే విధంగా ప్రోత్సహించారు. 

యాప్ లింక్‌‌‌‌ను నమ్మి కుటుంబ సభ్యుల నుంచి రూ.1.30 లక్షలు తీసుకొని అందులో పెట్టుబడి పెట్టాడు. అయితే కొద్ది రోజుల్లోనే యాప్ కనిపించకపోవడం, నిర్వాహకుల వివరాలు తెలియకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. దీంతో అవమాన భారంతో హాస్టల్ గదిలో ఉరేసుకొని సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు బెట్టింగ్, స్నేహితుల ఒత్తిళ్లు కారణం కాదని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు.

ట్రిపుల్ ఐటీలో సంతాప సభ

బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన సంతాప సభలో ఆర్జేయూకేటీ వైస్ చాన్స్‌‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సంపత్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యూనివర్సిటీ క్యాంపస్​లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయని, సైకాలజిస్టులు, మంచి ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారని, విద్యార్థులు ఒత్తిడికి లోనయినట్లయితే వారిని సంప్రదించాలని సూచించారు.