గ్రేటర్ నోయిడా: నంబర్ ప్లేట్లు కప్పి ఉంచిన సీఐ కొడుకు కారుకు రూ.30 వేల చలాన్ వేసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై బదిలీ వేటు పడింది. ఈ నెల 16న హెడ్ కానిస్టేబుల్ నకుల్.. నంబర్ ప్లేట్లకు తెల్ల కాగితాలు అంటించిన హ్యుందాయ్ క్రెటా కారును ఆపారు. డ్రైవర్ కారు దిగకపోవడంతో జరిమానా విధించారు. దీంతో అతడు తండ్రి, నాలెడ్జ్ పార్క్ సీఐ వినోద్ కుమార్‌కు ఫోన్ చేయగా, ఆయన ఎస్ఓజీ బృందంతో అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన వీడియో వైరల్ అయింది.
సీఐ దురుసుగా ప్రవర్తించారని నకుల్ ఫిర్యాదు చేయగా, అధికారులు నకుల్నే పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. ఈ విషయంపై డీసీపీ (ట్రాఫిక్) సయ్యద్ అలీ అబ్బాస్ మాట్లాడుతూ చలాన్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. భార్య అనారోగ్యంతో ఉండటంతో కొడుకు అవసరమైన పత్రాల కోసం కారులో ఆస్పత్రికి వెళ్లినట్టు సీఐ చెప్పారని తెలిపారు. పైఅధికారుల ఎదుట కానిస్టేబుల్ మాట్లాడిన తీరు సరిగ్గా లేదన్నారు. మరోవైపు సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ తాను కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించలేదని, నిబంధనలు ఉల్లంఘించినందుకే కొడుకు కారుకు చలాన్ పడిందని స్పష్టం చేశారు.
