దిగొచ్చిన బంగారం..ఒక్కరోజే తులంపై రూ.3,946 తగ్గుదల

దిగొచ్చిన బంగారం..ఒక్కరోజే తులంపై రూ.3,946 తగ్గుదల
  • రూ.1,26,304కు 24 క్యారెట్ల పసిడి
  • కిలో వెండిపై రూ.8,776 డౌన్
  • నెల గరిష్ఠంతో పోలిస్తే.. బంగారం 
  • రూ.22 వేలు, వెండి రూ.44 వేలు తక్కువ
  • రెండు రోజుల పెరుగుదలకు బ్రేక్

హైదరాబాద్, వెలుగు: రెండు రోజులు పెరిగి కొనుగోలుదారులను టెన్షన్ పెట్టిన బంగారం, వెండి ధరలు బుధవారం ఒక్కసారిగా దిగొచ్చాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,250 ఉండగా, బుధవారం రూ.3,946 తగ్గి రూ.1,26,304కు పడిపోయింది. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,150గా నమోదైంది. కిలో వెండి ధర మంగళవారం రూ.1,58,536 ఉండగా, ఒక్కరోజే రూ.8,776 తగ్గి రూ.1,49,760కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ, డిమాండ్–సరఫరా పరిస్థితులు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


పండుగ జోరు.. తర్వాత పతనం


నవంబర్ ఆరంభంలో ధన త్రయోదశి, దీపావళి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నెల 2న 24 క్యారెట్ల బంగారం రూ.1,42,190 ఉండగా, 5న ఒక్కరోజే రూ.6,450 ఎగబాకి ఈ నెల గరిష్ఠమైన రూ.1,48,750కి చేరింది.6న రూ.3,208 తగ్గినా, దీపావళి తర్వాత 9న మళ్లీ రూ.1,47,400కి ఎగబాకింది. వెండి కూడా 2న రూ.1,85,271 ఉండగా, 5న రూ.1,94,298 గరిష్ఠానికి చేరి, 9న రూ.1,92,850 వద్ద నిలిచింది.


12 రోజుల్లో రూ.20,950 డౌన్


పండుగ సీజన్ ముగియడం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో 10 నుంచి ధరల పతనం మొదలైంది. 9న రూ.1,47,400 ఉన్న బంగారం 21 నాటికి రూ.1,26,450కి, అంటే 12 రోజుల్లోనే రూ.20,950 తగ్గింది. వెండి కిలోకు రూ.1,92,850 నుంచి రూ.1,53,111కి, అంటే రూ.39,739 పతనమైంది. 20న ఒక్కరోజే బంగారం రూ.5,320, వెండి రూ.9,965 తగ్గాయి.


రెండు రోజుల బ్రేక్.. మళ్లీ డౌన్


23, 24 తేదీల్లో బంగారం వరుసగా రూ.2,091, రూ.1,709 చొప్పున మొత్తం రూ.3,800 పెరిగి రూ.1,30,250కి, వెండి రూ.5,425 పెరిగి రూ.1,58,536కి చేరాయి. బుధవారం మళ్లీ దిగొచ్చాయి. ఈ నెల 2తో పోలిస్తే బంగారం రూ.15,886, వెండి కిలోకు రూ.35,511 తగ్గాయి. 5 నాటి గరిష్ఠంతో పోలిస్తే బంగారం రూ.22,446, వెండి రూ.44,538 దిగొచ్చాయి.