‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని అంబర్పేట్ నుంచి ఉస్మానియా వర్సిటీ వరకు పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రను నటుడు వెంకటేశ్ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాంచందర్ రావు, సినీ నటుడు నిఖిల్, నటి పాయల్ రాజ్‌పుత్ పాల్గొన్నారు.
హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు, యువత డ్రగ్స్ బారినపడి తమ జీవితాలతో పాటు కుటుంబాలను నాశనం చేసుకోవద్దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే యువతను కాపాడుకోవాలని, దీనికోసం ప్రధాని మోదీ పిలుపు మేరకు 140 కోట్ల మంది భారతీయులు రాజకీయాలు, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏకం కావాలని కోరారు.
నషా ముక్త్ భారత్ అనేది ఏ ఒక్క పార్టీదో లేదా ప్రభుత్వ కార్యక్రమో కాదని.. ఇది పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, స్కూల్ నుంచి లోక్‌సభ వరకు సాగాల్సిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు. డ్రగ్స్ తయారు చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా ఉపేక్షించబోమని, మాదకద్రవ్యాల మాఫియాను చట్టం ముందు నిలబెట్టే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు.
బుధవారం ‘డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్-డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ లక్ష్యంతో అంబర్పేట్ మహంకాళి ఆలయం నుంచి కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రను సినీ హీరో వెంకటేశ్ జాతీయ జెండాను ఎగరవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్పేట్, ఉస్మానియా వర్సిటీ ప్రాంగణాల్లో జరిగిన సభల్లో కిషన్ రెడ్డి మాట్లాడారు.
దేశ జనాభాలో 25 శాతానికి పైగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం అందరి బాధ్యతని గుర్తుచేశారు. కొందరు దుర్మార్గులు, దేశద్రోహులు డబ్బు కోసం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, బస్తీల వద్ద చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో అమాయక విద్యార్థులకు మత్తుపదార్థాలు అలవాటు చేస్తూ తల్లిదండ్రుల ఆశలను చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక చేతిలో పుస్తకాలు, మరో చేతిలో పిడికిలి బిగించి ఉద్యమంలోకి వచ్చిన విద్యార్థులకు పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. సినీ నటుడు వెంకటేశ్ రాకతో ఈ పోరాటంలో విజయం మనదేనన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. అనంతరం ఓయూలో విద్యార్థులు, యువతతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం: రాంచందర్ రావు
దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని, దీనికి బీజేపీ రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక ప్రగతి, యువశక్తిని దెబ్బతీసేందుకు శత్రుదేశాలు, దేశద్రోహ శక్తులు డ్రగ్స్‌ను ఆయుధంగా వాడుతున్నాయని, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లలో కలుపుతున్నాయని రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించాలని, ర్యాంకులు, టాపర్లు, సివిల్స్ అంటూ శక్తికి మించిన మానసిక ఒత్తిడి పెట్టవద్దని కోరారు. ‘నషా ముక్త్ భారత్’ కంటే ముందుగా ‘నషా ముక్త్ తెలంగాణ’ సాధించాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్కూళ్లు, కాలేజీల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. గతంలో మావోయిజం, నక్సలిజం, ఉగ్రవాదం రూపంలో దాడులు జరిగితే.. ఇప్పుడు విదేశీ డ్రగ్స్ అక్రమ దిగుమతి ‘నార్కో టెర్రరిజం’ రూపంలో కొత్త ముప్పుగా మారిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
వర్సిటీ వీసీల ప్రశంసలు
కేవలం సందేశంతో సరిపెట్టకుండా మూడు రోజుల పాదయాత్ర చేపట్టడం కిషన్ రెడ్డి చిత్తశుద్ధికి, నిబద్ధతకు నిదర్శనమని సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ ప్రశంసించారు. ఓయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవల గవర్నర్ సమక్షంలోనూ చర్చించామని, ఈ యాత్రకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, అధ్యాపకులు కలిసి పనిచేయాలని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ నాగలపల్లి నాగరాజు
పిలుపునిచ్చారు.
టీ కొట్టులో చాయ్.. స్వామీజీల ఆశీర్వాదం
బుధవారం ఉదయం అంబర్పేట్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కిషన్ రెడ్డి పాదయాత్ర మొదలైంది. తిలక్ నగర్, కోరంటి మీదుగా ఓయూ వరకు యాత్ర సాగింది. ఇఫ్లూ స్టూడెంట్లు, లెక్చరర్లు రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలుపుతూ ప్రతిజ్ఞ చేశారు.
మోడల్ స్కూల్లో భోజన విరామం తర్వాత సీతాఫల్‌మండికి చేరుకోగా.. ఓ సాధారణ టీ కొట్టు వద్ద ఆగిన కిషన్ రెడ్డి స్థానికులతో సరదాగా కబుర్లు చెబుతూ చాయ్ తాగారు. చిలకలగూడ చౌరస్తాలో పూజ్యశ్రీ శంకర్ స్వామీజీ, యోగేశ్ ప్రభుజీ, శివస్వామి, విశ్వాత్మానంద గిరి స్వామీజీ, కృష్ణ చాముండేశ్వర మహర్షి, ఆత్మారాం మహారాజ్ తదితరులు యాత్రకు మద్దతిచ్చి, కిషన్ రెడ్డికి ఢమరుకం, త్రిశూలం అందించారు.
డ్రగ్స్‌కు నో.. జీవితానికి ఎస్ చెప్పండి: వెంకటేశ్
ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి’ అని పిలుపునిచ్చారు. యువతే భారత్‌కు అతిపెద్ద బలమని, ప్రభుత్వ అవకాశాలను వాడుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
వ్యసనానికి బానిసైన వారిని దూరం పెట్టకుండా, అండగా నిలిచి బయటపడేందుకు సాయం చేయాలని కోరారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ కోసం మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డి చేపట్టిన ఉద్యమానికి అంతా మద్దతు ఇవ్వాలన్నారు. పాదయాత్రలో సినీ నటుడు నిఖిల్, నటి పాయల్ రాజ్‌పుత్ కూడా పాల్గొని యువత మత్తుకు దూరంగా ఉండాలని కోరారు.
