పరిశ్రమలు బయటకు పోతలే! హిల్ట్ పాలసీ వచ్చి ఏడాది దాటినా పట్టించుకోని ఇండస్ట్రియలిస్టులు

పరిశ్రమలు బయటకు పోతలే! హిల్ట్ పాలసీ వచ్చి ఏడాది దాటినా పట్టించుకోని ఇండస్ట్రియలిస్టులు
  •  9,292 ఎకరాల కన్వర్షన్‌‌కు నిరుడు నవంబర్​లో నోటిఫికేషన్
  •  ఇప్పటివరకు 450 ఎకరాల కన్వర్షన్​కు 301 దరఖాస్తులు
  •  సిటీ లోపల, బయట భూముల రేట్ల వ్యత్యాసంతో  వెనుకంజ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) బయటకు తరలించి, ఆ భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మార్చాలనే సర్కారు ప్లాన్ ముందుకు అడుగేయటం లేదు. ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌‌ఫర్మేషన్ (హిల్ట్)’ పాలసీ అమల్లోకి వచ్చి ఏడాది దాటినా పారిశ్రామికవేత్తల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. 

ఏకంగా 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పటివరకు కేవలం 450 ఎకరాలకు సంబంధించి 301 అప్లికేషన్లు మాత్రమే రావడం అందుకు నిదర్శనం. సిటీ లోపల భూముల రేట్లు ఓఆర్ఆర్ బయట ధరలకంటే చాలా ఎక్కువగా ఉండటం, పైగా పరిశ్రమలను తరలించేందుకు ముందే పరిహారం ఇవ్వాలని ఇండస్ట్రియలిస్టులు మెలిక పెడుతుండటంతో ఈ పథకం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.

ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు

హైదరాబాద్‌‌లోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 22 ఇండస్ట్రియల్ పార్కుల్లోని 2,800కిపైగా పరిశ్రమలను బయటకు తరలించి, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా నిరుడు నవంబర్‌‌ 22న హిల్ట్ పాలసీ నోటిఫికేషన్ ఇచ్చింది. బాలానగర్, సనత్‌‌నగర్, జీడిమెట్ల, నాచారం, కూకట్‌‌పల్లి, కాటేదాన్, ఉప్పల్, మల్లాపూర్, మౌలాలి సహా ఓఆర్ఆర్ లోపల ఉన్న సుమారు రెండు దశాబ్దాల నాటి ఇండస్ట్రియల్ పార్కులు, స్టాండలోన్ యూనిట్ల పరిధిలోని 9,292 ఎకరాలను కన్వర్షన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

రోడ్లు, మౌలిక సదుపాయాలు పోను మిగిలిన భూములను రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్కులు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి మల్టీ-యూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌‌లైన్ పోర్టల్ ప్రారంభించి, ఫీజుల్లో వెసులుబాటు కల్పిస్తూ గడువును కూడా పొడిగిస్తూ వచ్చింది. అయినా పారిశ్రామికవేత్తలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు.

అసలు లెక్కలివే.. 

ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కాకపోయినా ఇప్పటివరకు మొత్తం 301 అప్లికేషన్లు మాత్రమే అందాయి. అవి కూడా కేవలం 450 ఎకరాల కన్వర్షన్‌‌కు సంబంధించినవే కావడం గమనార్హం. అంటే మొత్తం నోటిఫై చేసిన భూముల్లో కనీసం ఐదు శాతం కూడా దరఖాస్తులు రాలేదు. అప్లికేషన్లలో అత్యధికంగా పటాన్​చెరు, నాచారం నుంచి 39 దరఖాస్తులు వచ్చాయి. ఉప్పల్​ నుంచి 20, చర్లపల్లి నుంచి 19 పరిశ్రమలు రీలొకేషన్​కు దరఖాస్తు చేసుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. 

కానీ కాటేదాన్​, జీడిమెట్ల వంటి ప్రాంతాల నుంచి కేవలం సింగిల్​ డిజిట్​లోనే అప్లికేషన్లు వచ్చాయి. అభ్యంతరాలు లేని ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులకు వేగంగా క్లియరెన్స్ ఇచ్చి ఆదాయం రాబట్టాలని భావిస్తున్న సర్కారు, ప్రస్తుతం అందిన వాటిలో 232 అప్లికేషన్లను రివ్యూ చేస్తోంది. మరో 69 అప్లికేషన్లను పెండింగ్​లో పెట్టింది.  

 వెనుకంజకు కారణాలేంటంటే..

పారిశ్రామికవేత్తలు హిల్ట్ పాలసీపై ముందుకు రాకపోవడానికి ప్రధానంగా ఆర్థిక, మౌలిక వసతుల పరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ బయట భూముల రేట్లతో పోలిస్తే సిటీ లోపల రేట్లు చాలా ఎక్కువగా ఉండటం ఇండస్ట్రియలిస్టుల వెనుకంజకు ప్రధాన కారణంగా మారింది. భూమి కన్వర్షన్ కోసం చెల్లించాల్సిన ఫీజులు సిటీలోని భారీ మార్కెట్ రేట్ల ఆధారంగా ఉండటం, మరోవైపు సిటీలో ఉన్న విలువైన స్థలాన్ని వదులుకుని బయటకు వెళ్లడం ఆర్థికంగా లాభదాయకం కాదని యజమానులు భావిస్తున్నారు. పరిశ్రమను ఉన్నపళంగా కూల్చి కొత్త చోట ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మూడు నాలుగేండ్ల సమయం పడుతుందని పారిశ్రామిక సంఘాలు చెబుతున్నాయి. అందుకే పరిశ్రమను తరలించే ముందే ప్రభుత్వం తమకు తగిన పరిహారం లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. 

త్వరలో ఇండస్ట్రియలిస్టులతో భేటీ

హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని అంచనా వేయగా, స్పందన లేక అది నామమాత్రానికే పరిమితమైంది. అప్లికేషన్లు రాకపోవడంతో ఈ ఏడాది జూన్​ వరకూ ప్రభుత్వం గడువు పొడిగించింది. అయినా ఆశించిన స్పందన రాలేదు. ఒకవైపు సిటీలో కాలుష్యాన్ని తగ్గించడం, మరోవైపు అభివృద్ధి, ఆదాయ వనరులను పెంచుకోవడం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నా, పారిశ్రామికవేత్తల అభ్యంతరాలను పరిష్కరించకుండా పాలసీ సక్సెస్ అయ్యేలా లేదు. ముందే పరిహారం ఇవ్వాలన్న ఇండస్ట్రియలిస్టుల డిమాండ్​కు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశ్రామికవేత్తల డిమాండ్లు, ముఖ్యంగా ముందస్తు పరిహారం, రాయితీలు, ఓఆర్ఆర్ బయట ప్రత్యామ్నాయ వసతుల కల్పనపై చర్చించేందుకు త్వరలోనే ఇండస్ట్రియలిస్టులతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.