- డిసెంబర్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం స్కూళ్లకు పంపిణీ
- నెలాఖరుకు టీచర్ల ట్రైనింగ్ పూర్తి.. వెబ్సైట్లోనూ అందుబాటులోకి
- సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీఈఆర్టీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: సమాజంలో పెరిగిపోతున్న వరకట్న దురాచారం, గృహహింసను అరికట్టేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ కీలక అడుగు వేశాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచే వీటిపై పూర్తి అవగాహన కల్పించేందుకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బుక్లెట్లను తయారు చేశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మేనేజ్మెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు డిసెంబర్ నాటికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఈ బుక్లెట్లను పంపిణీ చేయనున్నాయి. భవిష్యత్తులో సిలబస్ మార్చినప్పుడు వీటిని పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నాయి.
స్కూల్ లెవెల్ లో సామాజిక దురాచారాలపై పాఠాలు సరిగ్గా లేవని, వరకట్నం, గృహహింస గురించి స్టూడెంట్స్‌కు క్రమబద్ధంగా బోధించడం లేదని ‘స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అజ్మల్ బేగ్’ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే 7 నుంచి 10వ తరగతి సోషల్ స్టడీస్‌లో వీటిపై ప్రత్యేక పాఠాలు చేర్చాలని సూచించింది. కేవలం చదువులకే పరిమితం కాకుండా.. విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజంలోనూ చైతన్యం వచ్చేలా చూడాలని చెప్పింది. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, మహిళా హెల్ప్‌డెస్క్‌లు, హెల్ప్‌లైన్ నంబర్లు, ఆన్లైన్ ఫిర్యాదుల వ్యవస్థ గురించి పిల్లలకు తెలియజేయాలని పేర్కొంది. అలాగే స్కూళ్లలో క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులను భాగస్వాములను చేయాలని, టీచర్లకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.
పోలీసులు, ఎన్జీవోలతో కలిసి తయారీ..
బుక్లెట్ల రూపకల్పనకు ఎస్సీఈఆర్టీ అధికారులు మే నెలలో హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీస్ షీ టీమ్స్, స్వచ్ఛంద సంస్థల నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి నవంబర్ వరకు వర్క్‌షాపులు జరిపి కంటెంట్ రచన, ఎడిటింగ్‌తో పాటు తెలుగు, ఉర్దూ అనువాదాలను పూర్తి చేశారు. బోధనా విధానంపై ఇప్పటికే డీఆర్పీలకు రాష్ట్ర స్థాయి శిక్షణ ముగియగా, ఈ నెలాఖరులోగా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల శిక్షణ కూడా పూర్తి కానుంది. డిసెంబర్ నాటికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ముద్రించిన బుక్లెట్లను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 7–10 తరగతుల విద్యార్థులకు పంపిణీ చేయడంతో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లోనూ అప్లోడ్ చేయనున్నారు.-----------
ఇప్పటికే ఉన్న పాఠాలకు అదనంగా..
ప్రస్తుతం రాష్ట్రంలోని 6 నుంచి 10వ తరగతి సోషల్ స్టడీస్‌లో లింగ సమానత్వం, కుల వివక్ష, మానవ హక్కులు, వరకట్న నిషేధ చట్టం–1961, గృహహింస నిరోధక చట్టం–2005 వంటి అంశాలపై పాఠాలు బోధిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ అంశాలను విద్యార్థులకు మరింత లోతుగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి విద్యాశాఖ ప్రత్యేక బుక్లెట్లను రూపొందించింది. వీటిలో వరకట్న అనర్థాలు, రాజ్యాంగ విలువలు, గృహహింసలోని రకాలు, మహిళల చట్టపరమైన హక్కులు, రక్షణ చర్యలను సమగ్రంగా పొందుపరిచారు. భవిష్యత్తులో పాఠ్యప్రణాళికను సవరించినప్పుడు, ఈ అంశాలన్నింటినీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు.
