టాయిలెట్ పేపర్ కోసం ఎగబడుతున్న అమెరికన్లు..పానిక్ షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ధరలకు రెక్కలు

టాయిలెట్ పేపర్ కోసం ఎగబడుతున్న అమెరికన్లు..పానిక్ షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ధరలకు రెక్కలు
  • ప్రతి పది షాపుల్లో ఒకదాంట్లో ఔటాఫ్ స్టాక్
  • 90 రోజులు కరెంట్ ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం 
  • జనరేటర్లు, నిల్వ ఉండే ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ తీవ్ర కొరత
  • ఎగబడి కొని డబ్బు వృథా చేయొద్దు.. 
  • కనీస నిల్వలు చాలంటున్న నిపుణులు

వాషింగ్టన్: అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. టాయిలెట్ పేపర్, జనరేటర్లు, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫ్రీజ్-డ్రైడ్ ఫుడ్ కోసం జనం రిటైల్ స్టోర్లు, ఆన్‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లపై ఎగబడుతున్నారు. 

గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న టెక్నాలజీ అంతరాయాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన రాకపోకలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి కీలక విభాగాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో జనం అలర్ట్ అయ్యారు. 

దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణతో వ్యవస్థలపై సైబర్ హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందనే భయాలు కూడా తోడవడంతో, అత్యవసర సేవలు నిలిచిపోతే ఎలా అనే ఆందోళనతో ముందుజాగ్రత్తగా సరుకులు నిల్వ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు కరెంటు ఉండకపోవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టడం కూడా కొనుగోళ్ల జోరుకు ఆజ్యం పోస్తోంది.

పెరుగుతున్న ధరలు

సాధారణంగా బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే వేళ భారీ ఆఫర్లతో వస్తువుల ధరలు తగ్గుతాయి. కానీ, బ్లూమ్‌‌‌‌బెర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ ప్రకారం, ఎమర్జెన్సీ వస్తువుల విషయంలో మాత్రం డిమాండ్ పెరిగి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫ్రీజ్-డ్రైడ్ ఫుడ్ ధరలు 12 శాతం పెరగగా, మూడో వంతుకు పైగా సరుకు స్టాక్ అవుట్ అయింది. 

అలాగే, ఐదింట ఒక వంతుకు పైగా జనరేటర్లు అమ్ముడుపోగా, టాయిలెట్ పేపర్ ధర 4 శాతం పెరిగి దాదాపు 10 శాతం స్టాక్ ఖాళీ అయింది. ఇదే సమయంలో దుస్తులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వంటి సుమారు 1,400 ఇతర వస్తువుల ధరలు సగటున ఒక శాతం తగ్గడం గమనార్హం. 

పేపర్ టవల్స్, బ్యాటరీలు, చెత్త బ్యాగుల ధరలు కూడా గతేడాదితో పోలిస్తే భారమయ్యాయి. జనరేటర్ల కొరత కూడా వేధిస్తోంది. రానున్న క్రిస్మస్, బ్లాక్ ఫ్రైడే సీజన్లలో వస్తువులు లభించవన్న ఉద్దేశంతో ప్రజలు ఇప్పుడే నిల్వ చేసుకుంటున్నారు. బాటిల్డ్ వాటర్, బియ్యం, క్యాన్లలోని ఆహారం, క్యాంపింగ్ గేర్ కొనుగోళ్లు పెరిగినట్లు వాల్ మార్ట్, కాస్ట్‌‌‌‌కో వంటి సంస్థలు తెలిపాయి.

కనీస నిల్వ మంచిదే.. అతిగా కొనొద్దు

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని 'క్యాజువల్ ప్రిప్పర్స్' పాడ్‌‌‌‌కాస్ట్ డౌన్‌‌‌‌లోడ్లు 33 శాతం పెరగడం స్పష్టం చేస్తోంది. అయితే సమాజం కుప్పకూలిపోతుందనే భయంతో విపరీతంగా కొనుగోలు చేసి డబ్బు వృథా చేయడం కంటే, అనుకోని ఆపదలు లేదా వ్యక్తిగత అత్యవసరాల కోసం కనీస నీరు, నిల్వ ఆహారం సిద్ధంగా ఉంచుకోవడం ప్రాక్టికల్ అని ఆర్థిక, విపత్తు నిర్వహణ నిపుణులు సూచిస్తున్నారు.