స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. ఒక్కరోజే రూ.3.49 లక్షల కోట్ల లాభం!

స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. ఒక్కరోజే రూ.3.49 లక్షల కోట్ల లాభం!
  • సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1,500 పాయింట్లు జంప్​
  • 25,800 దాటిన నిఫ్టీ  
  • ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌  షేర్లలో భారీ కొనుగోళ్లు

ముంబై: దేశీయ స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు బుధవారం జెట్​స్పీడ్​తో దూసుకెళ్లాయి. సోమవారం భారీ పతనం తర్వాత బలంగా పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడం సూచీలకు ఊతమిచ్చింది. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కొనసాగడం, ముడిచమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను బలపరిచాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1,502.29 పాయింట్లు (1.82 శాతం) పెరిగి 83,938.28 వద్ద ముగిసింది. 

ఉదయం 83,436.89 వద్ద ప్రారంభమైన సూచీ.. ఒక దశలో 84,498.21 గరిష్ట స్థాయిని తాకింది. కనిష్టంగా 83,380.75కు పడిపోయింది. నిఫ్టీ 469.60 పాయింట్లు (1.85 శాతం) లాభపడి 25,819.25 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో 25,951.65 గరిష్ట స్థాయికి చేరింది. దీంతో 26,000 మార్కుకు చేరువైంది.  ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.3.49 లక్షల కోట్లు పెరిగి రూ.512.41 లక్షల కోట్లకు చేరింది. 

 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ షేర్ల జోరు 

బీఎస్​ఈ సెక్టోరల్​ సూచీల్లో నిఫ్టీ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ అత్యధికంగా 3.79 శాతం పెరిగింది. నిఫ్టీ ఫార్మా 2.38 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ 2.17 శాతం, నిఫ్టీ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ 2.21 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ 1.79 శాతం, నిఫ్టీ ఆటో 1.16 శాతం, నిఫ్టీ ఐటీ 1.12 శాతం పెరిగాయి.  నిఫ్టీ మీడియా 4.44 శాతం, నిఫ్టీ మెటల్‌‌‌‌‌‌‌‌ 2.04 శాతం పడిపోయాయి. నిఫ్టీ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ 100 కేవలం 0.30 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ 100 మాత్రం 0.44 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌ అత్యధికంగా 5.94 శాతం పెరిగింది.

 ట్రెంట్‌‌‌‌‌‌‌‌ 3.59 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ 3.44 శాతం, ఇండిగో 3.24 శాతం, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ 3.18 శాతం లాభపడ్డాయి. బజాజ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, ఐటీసీ, టీసీఎస్‌‌‌‌‌‌‌‌, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌, ఎటర్నల్‌‌‌‌‌‌‌‌ షేర్లు కూడా పెరిగాయి.  టాటా స్టీల్‌‌‌‌‌‌‌‌ 2.54 శాతం, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌ 0.57 శాతం, టైటాన్‌‌‌‌‌‌‌‌ 0.38 శాతం తగ్గాయి. 
  ర్యాలీకి కారణాలు
     విదేశీ పెట్టుబడుల ప్రవాహం: ఈ నెల ఇప్పటికే విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.  నెలల తరబడి అమ్మకాల తర్వాత ఈ కొనుగోళ్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో నగదు లభ్యతను, సెంటిమెంట్​ను పెంచాయి. ఎఫ్​ఐఐలు బుధవారం ఒక్క రోజే రూ.4,479.08 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.

    90 డాలర్ల దిగువకు ముడి చమురు: సరఫరా పెరుగుతుందన్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా మిగులు సరఫరా ఏర్పడవచ్చన్న సంకేతాలతో బ్రెంట్‌‌‌‌‌‌‌‌ క్రూడ్‌‌‌‌‌‌‌‌ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 90 డాలర్ల దిగువకు పడిపోయింది. నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటి వరకు ధరలు సుమారు 24 శాతం తగ్గాయి. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌‌‌‌‌‌‌‌కు ఇది ఊరటనిచ్చే పరిణామని ఎనలిస్టులు చెబుతున్నారు.

    దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు: జులై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో కంపెనీల త్రైమాసిక ఫలితాలు గత నాలుగేళ్లలో అత్యుత్తమంగా ఉన్నాయని రాయిటర్స్‌‌‌‌‌‌‌‌ వార్తాసంస్థ పేర్కొంది.
    తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు: మార్కెట్‌‌‌‌‌‌‌‌ సోమవారం భారీగా పడిపోవడంతో ప్రధాన కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన ధరలకు చేరాయి. దీంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సహా పెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ గత నష్టాల్లో గణనీయమైన భాగాన్ని తిరిగి భర్తీ చేశాయి.

 65 పైసలు పెరిగిన రూపాయి 

డాలర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే రూపాయి బుధవారం 65 పైసలు బలపడి రూ.92.20 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక స్థాయి. దేశీయ స్టాక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడిచమురు ధరల తగ్గుదల రూపాయికి మద్దతిచ్చాయి. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌ 13న రూ.94.19 వద్ద ఉన్న రూపాయి.. వరుసగా ఐదు సెషన్లలో 1.6 శాతానికి పైగా కోలుకుంది. గత 7 వారాల్లో కనిష్ట స్థాయి రూ.96.88 నుంచి దాదాపు ఐదు శాతం బలపడింది. రాబోయే రోజుల్లోనూ రూపాయి సానుకూలంగా కదలవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.