భా రతదేశం ఈరోజు77వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా తన ప్రజాస్వామ్య ప్రయాణాన్ని కొనసాగించడం ఒక అసాధారణమైన చారిత్రక విజయం. భిన్నమైన మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు, ప్రాంతీయ అస్తిత్వాలు, ఆర్థిక స్థితిగతులు కలిగిన కోట్లాది ప్రజలు నివసిస్తున్న ఈ దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగించడం అంత సులభమైన విషయం కాదు.
ముఖ్యంగా అపారమైన సంపద కొద్దిమంది వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో కేంద్రీకృతమవుతూ, మరోవైపు లక్షలాది కుటుంబాలు పేదరికం, కనీస అవసరాల కొరతతో సతమతమవుతున్న సమాజంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం మరింత సంక్లిష్టమైన సవాలు. అయినప్పటికీ భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను కొనసాగించగలుగుతుండటానికి ప్రధానమైన పునాది రక్తపాతరహిత మానవ పురోగతిని ఆశించే ప్రాగ్మాటిక్ ఆలోచనల ధార కలిగిన రాజ్యాంగమే.
అసమాన అభివృద్ధి.. ప్రజాస్వామ్యానికి పరీక్ష
దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతున్నప్పటికీ సంపద పంపిణీలో తీవ్ర అసమానతలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు, అన్ని సామాజిక వర్గాలకు సమానంగా చేరడం లేదు. కొన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంటే, మరికొన్ని ప్రాంతాలు ప్రాథమిక సదుపాయాల కోసం పోరాడుతున్నాయి. ఈ అసమాన అభివృద్ధి భారత ప్రజాస్వామ్యానికి ఒక తీవ్రమైన పరీక్షగా నిలుస్తోంది. మరోవైపు మతపరమైన అసహనం, కుల ఆధిపత్యం, సామాజిక వివక్ష వంటి పరిణామాలు రాజ్యాంగం ఆశించిన సమానత్వ సమాజానికి సవాళ్లుగా మారుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌమాధికారులు కావాల్సి ఉండగా, ఆచరణలో కొన్ని సందర్భాల్లో కుల, ధన, రాజకీయ ఆధిపత్య శక్తులు ప్రజల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వ్యవస్థలోనూ బలహీన వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు, నిర్ణయాధికారం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.
సమగ్ర వ్యవస్థగా భారత రాజ్యాంగం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం ప్రపంచంతో పోటీపడుతున్నప్పటికీ, మరోవైపు మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు కొనసాగుతుండటం మన సమాజంలోని అంతర్గత వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. మానవీయ విలువలు సమాజంలో సమానంగా విస్తరించడం లేదు. దేశ యువత నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. విద్యావంతులైన యువతకు తగిన ఉద్యోగాలు కల్పించడంలో వ్యవస్థ ఎదుర్కొంటున్న వైఫల్యాలు వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి.
పాలనా పారదర్శకత లోపాలు ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాలు, విభేదాలు, అసమానతలు ఉన్నప్పటికీ భారతదేశం ఒక సమాజంగా విచ్ఛిన్నం కాకుండా ముందుకు సాగడానికి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి, అణగారిన వర్గాలకు న్యాయం కోసం పోరాడే అవకాశాన్ని కల్పించడానికి ఒక సమగ్ర వ్యవస్థగా భారత రాజ్యాంగం నిలుస్తోంది. 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం కేవలం రాజ్యాంగాన్ని స్మరించుకోవడం మాత్రమే కాకుండా, దాని ఆశయాలను మన సామాజిక జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి.
- నాగం కుమారస్వామి
అసిస్టెంట్ ప్రొఫెసర్, పాలమూరు యూనివర్సిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు
పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
