ప్రపంచవ్యాప్తంగా కీర్తిస్తున్న భారత రాజ్యాంగం దేశ ప్రజలకు పవిత్రమైన గ్రంథం. రాజ్యాంగం రూపకర్త డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం. భారత ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజ్యాంగాన్ని పాలకులు అమలుచేసే విధానంతో దేశ ప్రజల ప్రయోజనాలు ఆధారపడుతాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఓటు హక్కు కల్పించడం, ప్రతి పౌరుడికి సమానత్వం అందించడం, అధికార వ్యవస్థలపై రాజ్యాంగ పరమైన నియంత్రణ ఉంచడం వంటి మౌలిక సూత్రాలన్నీ భారత రాజ్యాంగం ప్రసాదించినవే.
స్వాతంత్య్రం అనంతరం దేశం ఎన్నో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా కొనసాగడానికి రాజ్యాంగ విలువలే ప్రధాన ఆధారం. దేశంలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే రాజ్యాంగ సంస్థల స్వతంత్రత, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ఎండగడుతూ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహిస్తుంది.
కేంద్రంలోని బీజేపీ స్వయంప్రతిపత్తి గల ఎన్నికల సంఘం, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలపై అధికార ఒత్తిడి తీసుకొస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోంది. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న బీజేపీ ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఓటర్ల జాబితా మొదలుకొని ఎన్నికల నిర్వహణ వరకు ప్రక్రియలన్నింటినీ నీరుగారుస్తోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియతో దేశవ్యాప్తంగా 13 కోట్లకుపైగా ఓట్లు గల్లంతయ్యాయి.
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా మరణించినవారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారి పేర్లు, డూప్లికేట్ ఓట్లను తొలగిస్తున్నట్టు ఎన్నికల సంఘం చెబుతున్నా ఇందులో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. సర్ ప్రక్రియతో అర్హులైనవారి ఓట్లను తొలగిస్తున్నారని పలు రుజువులతో నిరూపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దీర్ఘకాలికంగా పోరాడుతున్నా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టలేదు. సర్ ప్రక్రియలో పలు లోపాలున్నాయని ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దృష్టికి మరో ఇద్దరు కమిషనర్లు తీసుకెళ్లిన్నట్టు వార్తలు రావడంతో కాంగ్రెస్ చెబుతున్న ఎన్నికల సంఘంలో లోపాలు నిజమని తేలాయి.
తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండడంతో కాంగ్రెస్ ముందస్తు చర్యలతో పార్టీ కార్యకర్తలను జాగృతం చేసింది. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఆమోదించాలని తెలంగాణ సర్కారు కోరినా ఎన్నికల సంఘం ఆమోదించకపోవడం దురదృష్టకరం.
కాంగ్రెస్ ఉద్యమాలతో ..
దేశంలో ఓట్ చోరీ జరుగుతుందని, ఎన్నికల నిర్వహణలో విఫలమైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మార్గదర్శకత్వంలో, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక్ గాంధీ నేతృత్వంలో అక్టోబర్‌లో పలు ఉద్యమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీల మైదానంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ ఉద్యమాలకు భారీ స్పందన వస్తుండడంతో ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది.
తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ‘అందుబాటులో లేని/వలస వెళ్లిన’ జాబితా కింద ఓటు కోల్పోయినవారి కోసం ప్రత్యేక ఎన్యుమరేషన్ ఫారాలను జారీ చేస్తుంది. గతంలో ఫారం-6లో మార్పులు చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సిన నిబంధనను కూడా సవరించింది. పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుత జాబితాను పోల్చి, పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్ల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు స్వయంగా వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఓట్లను తొలగించే ఫారం-7 దరఖాస్తుల సంఖ్యపై పరిమితి విధించింది.
సాంకేతిక లోపాలపై ఫిర్యాదులు వచ్చిన ఈసీఐనెట్ పోర్టల్‌ను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎన్నికల సంఘాన్నే తొలుత ప్రక్షాళించాలనే డిమాండ్ తో ‘సంవిధాన్ రక్షా’ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియనే కాకుండా స్వతంత్రంగా ఉండాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థల విచారణలు రాజకీయ పక్షపాతంతో కూడుకొని, ప్రతిపక్ష నేతలపై వరుస దాడులు, విచారణలు, అరెస్టులు జరుగుతున్నాయి. 2025లో
రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈడీ రాజకీయ నాయకులపై 190కుపైగా కేసులు నమోదు చేసింది. వీటిలో అధిక శాతం ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. సీబీఐ వ్యవహారంలోనూ ఇలాంటి వైఖరే కనిపిస్తోంది.
రాజ్యాంగాన్ని రక్షించడమే కాంగ్రెస్ సంకల్పం
జనాభా ఆధారంగా లోక్‌సభ. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దులను పునర్నిర్ణయించే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. జనాభా నియంత్రణ, అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలు పునర్విభజనతో పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల ప్రాతినిధ్యం, రాష్ట్రాల మధ్య సమతుల్యత, రాజ్యాంగపరమైన విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత చర్చ జరగాలి. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, అశాస్త్రీయమైన డీలిమిటేషన్ చేపట్టవద్దని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు డా.అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లకు తూట్లు పొడవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.
డా.అంబేద్కర్ ను అవమానించేలా హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో వ్యాఖ్యానించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారికి అంబేద్కర్‌పై, రాజ్యాంగంపై గౌరవం లేదని చెప్పడానికి నిదర్శనం. దేశ ప్రజలందరి హక్కుల రక్షణ కవచమైన రాజ్యాంగాన్ని నీరుగారుస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులపై పోరాడటం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటుహక్కును కాపాడుతూ, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను నిలబెడుతూ, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే కాంగ్రెస్ సంకల్పం. అధికార అహంకారానికి ప్రజాస్వామ్యమే సమాధానంగా.. నియంతృత్వ పోకడలకు రాజ్యాంగమే అడ్డుకట్టగా నిలవాలి. బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సంరక్షణ కోసం వాడవాడలా ‘సంవిధాన్ రక్షా మార్చ్’ చేపడుతున్న కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణలో వెనకడుగు వేయదు!
- బి.మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు
పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
