చండీగఢ్: 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ తిరిగి పొత్తు పెట్టుకోవడంపై పంజాబ్ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గతంలో బీజేపీపై తాను చేసిన వ్యతిరేక వైఖరిని వదిలేసి, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ రైతు ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. ఆ కూటమిని అపవిత్ర పొత్తుగా అభివర్ణించింది. ఆ 2 పార్టీలు కలవడాన్ని రైతు సంఘాలు వ్యతిరేకించడం సరైనదేనని పేర్కొంది.
ఒకప్పుడు బీజేపీని రైతు వ్యతిరేక, పంజాబ్ వ్యతిరేక పార్టీగా ముద్రవేసిన సుఖ్బీర్ బాదల్, ఇప్పుడు తిరిగి ఆ పార్టీతోనే చేతులు కలిపారని దుయ్యబట్టింది. కేవలం అధికార దాహంతోనే ఈ పొత్తు కుదుర్చుకున్నారని, పంజాబ్ వ్యవసాయ సంక్షోభాన్ని అకాలీదళ్ నాయకత్వం విస్మరించిందని ఆరోపించింది. రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన త్యాగాలను పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
