నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఐటీ ఉద్యోగి ప్రాణం తీసింది..ఐటీ కారిడార్లో ఘటన

నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఐటీ ఉద్యోగి ప్రాణం తీసింది..ఐటీ కారిడార్లో ఘటన
  • అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టిన బుల్లెట్​
  • వెనక కూర్చున్న యువతి మృతి
  • ఓవర్​స్పీడే  కారణం 

మాదాపూర్, వెలుగు : ఐటీ కారిడార్ లో బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో వెనక కూర్చున్న ఓ సాఫ్ట్​వేర్​ఇంజినీర్​కన్నుమూసింది. డ్రైవ్ చేసిన ఆమె స్నేహితుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వైజాగ్ కి చెందిన కొతిలి అక్షయ్ కుమార్ (28), రాజస్థాన్ జైపూర్ కి చెందిన సుష్మా చౌదరి(28) ఇద్దరూ  స్నేహితులు. 

సుష్మా కొండాపూర్ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ సాఫ్ట్​వేర్​జాబ్​చేస్తుండగా..అక్షయ్ కుమార్  ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరు కలిసి మంగళవారం అర్ధరాత్రి మాదాపూర్‌‌‌‌లోని  కావూరి హిల్స్ లో తమ స్నేహితుడు సందీప్ ఇంటికి డిన్నర్​కు వెళ్లారు. తెల్లవారుజామున అక్షయ్ తన బుల్లెట్ పై సుష్మాను వెనుక కూర్చోబెట్టుకుని కొండాపూర్‌‌‌‌కు బయలుదేరాడు. 

అక్షయ్ బైక్ ని వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో హైటెక్ సిటీ, చిన్న పెద్దమ్మ టెంపుల్ సమీపంలోని సీఐఐ జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి మొదట రోడ్డు డివైడర్‌‌‌‌ను, తర్వాత డివైడర్ మధ్యలోని చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో సుష్మా చౌదరి తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మాదాపూర్‌‌‌‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చనిపోయింది.  మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.