- సెక్రటరీల కమిటీకి బదులు టెక్నికల్ కమిటీకే మహారాష్ట్ర పట్టు
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని ఆశిస్తున్న తరుణంలో మహారాష్ట్ర కొత్త మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 26న ముంబైలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో అంగీకరించిన సెక్రటరీల కమిటీ ప్రతిపాదనను పక్కనపెట్టి, ఇప్పుడు టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
దీంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు కొత్త సవాలుగా మారింది. సెక్రటరీల కమిటీ అంటే పాలనా, విధానపరమైన నిర్ణయాల దిశగా వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, గతంలో 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్రలోని అటవీ ప్రాంతం, వన్యప్రాణి అభయారణ్యం ముంపునకు గురవుతుందనే అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావివ్వకూడదని మహారాష్ట్ర భావిస్తున్నట్లు తెలుస్తున్నది. బ్యారేజీ ఎత్తు పెంపు వల్ల కలిగే ప్రభావం, నీటి నిల్వ, బ్యాక్ వాటర్ ముంపు, పర్యావరణ అంశాలపై ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కూడిన ‘టెక్నికల్ కమిటీ’ ద్వారా పక్కాగా స్టడీ చేయించాకే ముందుకు వెళ్లాలని మహారాష్ట్ర యోచిస్తున్నట్టు సమాచారం.
అక్టోబర్ 26న ముంబైలో ఏం జరిగిందంటే?
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర సమ్మతి కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం అక్టోబర్ 26న ముంబైలో పర్యటించింది. సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఇరు రాష్ట్రాల సీఎస్ , నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో 1975 అక్టోబర్ 6న కుదిరిన ఒప్పందం నుంచి ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
2016 ఆగస్టు 23న జరిగిన ఒప్పందం ప్రకారం బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకే పరిమితం చేస్తే, తెలంగాణ అవసరాలు తీరవని, విద్యుత్ ఖర్చులు తగ్గించి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలించాలంటే 152 మీటర్ల ఎత్తు అవసరమని తెలంగాణ వాదించింది. . ఆ భేటీలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందిస్తూ, మహారాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఎలాంటి నష్టం కలగని పక్షంలో సహకరిస్తామని తెలిపారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, పరిహారంతో పాటు ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలో జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఇప్పుడు మాత్రం టెక్నికల్ కమిటీ వేయాలని సంప్రదింపులు జరుపుతున్నారు.
