- పల్నాడు వాటర్ గ్రిడ్‌పై సర్కారు నోరు మెదపలేదని మినిట్స్‌తో బయటపడింది: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నారని, కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్సే సజీవ సాక్ష్యమని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ ప్రాజెక్టు అంశాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా, తెలంగాణకు శాపంగా మారిందని తెలిపారు. బుధవారం ఆయన ‘ఎక్స్’ లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై సీఎం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
ఏపీ సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీకి పెద్దపీట వేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు. దీనిపై సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహానికి పాల్పడ్డారని, ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ భేటీలో కృష్ణా జలాల మళ్లింపుకు సంబంధించిన పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలోనూ అదే వైఖరి అవలంబించారని విమర్శించారు.
