హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చేపడుతున్న నియామక సంస్కరణలు, ఆన్లైన్ పరీక్షల నిర్వహణ విధానాలపై అధ్యయనం చేసేందుకు ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) గజేంద్ర జోషి బుధవారం టీజీపీఎస్సీని సందర్శించారు. స్టడీ టూర్లో భాగంగా వచ్చిన ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో నియామక వ్యవస్థలో సామర్థ్యం, పారదర్శకత, ప్రభావశీలతను పెంచేందుకు టీజీపీఎస్సీ చేపట్టిన సంస్కరణలు, నూతన కార్యక్రమాలతో పాటు నియామక ప్రక్రియలోని వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. సురక్షితమైన, పటిష్టమైన వాతావరణంలో ఆన్లైన్ పరీక్షల నిర్వహణ, అందులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనాపరమైన సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించారు. పరీక్షల ప్రక్రియలో సమగ్రత, విశ్వసనీయతను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అనుభవాలను పంచుకున్నారు.
