రాజ్యాంగం ప్రకటించిన సమానత్వం నిజంగా ప్రజల జీవితాల్లోకి వచ్చిందా? లేక అది రాజ్యాంగ పుస్తకాల్లో, ప్రభుత్వ ప్రసంగాల్లో, అధికారిక వేడుకల్లో మాత్రమే మిగిలిపోయిందా? ఈ ప్రశ్న రాజ్యాంగాన్ని వ్యతిరేకించేది కాదు. రాజ్యాంగం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరే ప్రశ్న. రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. కానీ ఆ హక్కులను అనుభవించే సామాజిక పరిస్థితులను మనం కల్పించామా? ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదు. ప్రతిరోజూ మన జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉండటం. ఈరోజు మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు కూడా ఇదే. ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడి ఓటు విలువైనదవుతుంది. కానీ ఎన్నికల తర్వాత అదే పౌరుడు తన హక్కుల కోసం ప్రశ్నిస్తే అతని గొంతు వినిపించడానికి వ్యవస్థలు వెనుకాడుతున్నాయి.
రాజ్యాంగ దినోత్సవం అంటే కేవలం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పీఠికను చదవడం, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన విలువలు ప్రజల జీవితాల్లో ఎంతవరకు అమలవుతున్నాయో ప్రశ్నించుకునే రోజు కావాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే దాని పట్ల విధేయత ప్రకటించడం మాత్రమే కాదు. దానికి విరుద్ధంగా పనిచేసే కుల, మత, ఆర్థిక ఆధిపత్యాలను ప్రశ్నించడం కూడా. ఇంకా ముఖ్యంగా దళిత, ఆదివాసీ మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, విధాన నిర్ణేతలుగా స్థానం కల్పించాలి.
రాజ్యాంగం ఎవరి దయతోనో లభించిన హక్కుల పత్రం కాదు. అది ప్రజల పోరాటాల నుంచి, స్వేచ్ఛా ఆకాంక్షల నుంచి, సమానత్వ స్వప్నాల నుంచి రూపొందిన సామాజిక ఒప్పందం. అందులోని హక్కులను ప్రతి ఒక్కరికీ అందించినపుడే రాజ్యాంగంలోని సమానత్వం అక్షరాల నుంచి ఆచరణలోకి వచ్చినట్టవుతుంది. అప్పటివరకు రాజ్యాంగ దినోత్సవం మనకు సంబరాల రోజు మాత్రమే కాదు, మన ప్రజాస్వామిక వైఫల్యాలను గుర్తుచేసే ఆత్మపరిశీలన దినం కూడా కావాలి.
- కవిత పులిఉపాధ్యాయురాలు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు
పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
