గ్రేటర్ వరంగల్లో ఘటన కేసును ఛేదించిన పోలీసులు, 12 మందిపై కేసు

గ్రేటర్ వరంగల్లో ఘటన కేసును ఛేదించిన పోలీసులు, 12 మందిపై కేసు

కాశీబుగ్గ, వెలుగు: కన్నబిడ్డనే డబ్బుల కోసం విక్రయించిన ఘటన గ్రేటర్ వరంగల్‌‌లో వెలుగుచూసింది. నాలుగు నెలల ఆడ శిశువును రూ.2.90 లక్షలకు విక్రయించి, గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు కట్టుకథ అల్లారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో 12 మంది నిందితులను అరెస్టు చేశారు. పసికందును రక్షించారు. మట్టెవాడ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ సమ్మయ్య నగర్‌‌కు చెందిన సుమన్, అఖిల దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, నాలుగు నెలల కింద మూడో ఆడపిల్ల జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో పాపను పోషించడం కష్టమని భావించిన దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి విక్రయించాలని నిర్ణయించారు. 

మధ్యవర్తుల ద్వారా పిల్లలు లేని వ్యక్తులను సంప్రదించి రూ.2.90 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మధ్యవర్తుల ద్వారా పాపను కొనుగోలుదారులకు అప్పగించారు. డబ్బులను మధ్యవర్తులు, కుటుంబ సభ్యులు పంచుకున్నారు. అనంతరం బంధువులు పాప గురించి ప్రశ్నించగా, ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లిందని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో విషయం పోలీసుల దృష్టికి రావడంతో మట్టెవాడ పోలీసులు చైల్డ్ హెల్ప్‌‌లైన్ ప్రతినిధుల సమక్షంలో దర్యాప్తు చేపట్టారు. 

ఈ క్రమంలో 24వ తేదీ రాత్రి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేశారు. కొనుగోలుదారుడి వద్ద ఉన్న నాలుగు నెలల పాపను సురక్షితంగా రక్షించి, నిందితుల నుంచి రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును 48 గంటల్లో ఛేదించి శిశువును రక్షించిన మట్టెవాడ పోలీసులను సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత అభినందించారు.