ముందస్తు అణుదాడికీ వెనుకాడం..రష్యా మాజీ ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్

ముందస్తు అణుదాడికీ వెనుకాడం..రష్యా మాజీ ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్

మాస్కో: కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రష్యా ముందస్తుగా అణు దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ మాజీ ప్రెసిడెంట్, భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్, నాటో దేశాలు ఇప్పటికే కొన్ని పరిమితులను అతిక్రమించాయని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు ముందస్తు అణు దాడికి గల అవకాశాలను మాస్కో జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా పత్రికలో ఆయన వివరించారు. పెద్ద ఎత్తున అణ్వాయుధేతర దాడులు జరిగి విపత్తులు సంభవించినప్పుడు రష్యా అణు దాడి చేసే అవకాశం ఉంటుందని దిమిత్రి మెద్వెదేవ్ తెలిపారు. 

పశ్చిమ దేశాల నుంచి కీవ్‌‌‌‌కు రహస్యంగా అణ్వాయుధాలు సరఫరా అయితే రష్యా స్పందించాల్సి ఉంటుందని చెప్పారు. రష్యాకు అణ్వాయుధాలను ఉపయోగించే హక్కు మాత్రమే కాదని, కొన్ని సందర్భాల్లో బాధ్యత కూడా ఉంటుందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ పేర్కొంది. అణు దాడి చేసే ముందు కలిగే నష్టానికి ప్రతిస్పందన సమానంగా ఉంటుందో లేదో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాగ్రత్తగా పరిశీలిస్తారని మెద్వెదేవ్ వివరించారు. 'స్టేట్ సోవరీన్టీ అండ్ న్యూక్లియర్ వెపన్స్' పేరుతో రాసిన ఈ వ్యాసంలో రష్యా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

అణు ఉపగ్రహంపై వార్తలు

రష్యా అణ్వాయుధాలతో కూడిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని జర్మనీ మీడియా సంస్థలు ఎన్‌‌‌‌డీఆర్, డబ్ల్యూడీఆర్ వెల్లడించాయి. ‘స్పుత్నిక్-ఎస్’ పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని వచ్చే 60 రోజుల్లో ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇతర ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు దీనిని ఉపయోగించవచ్చని ఆ నివేదికలు తెలిపాయి. అయితే, ఈ వార్తలను బెర్లిన్‌‌‌‌లోని రష్యా రాయబార కార్యాలయం నిరాధారమైనవిగా కొట్టిపారేసింది.