రూ.169 కోట్లతో సీఎంసీ ట్విన్ టవర్స్..కొత్తకుంట చెరువు పక్కన 4.11 ఎకరాల్లో నిర్మాణం

రూ.169 కోట్లతో సీఎంసీ ట్విన్ టవర్స్..కొత్తకుంట చెరువు పక్కన 4.11 ఎకరాల్లో నిర్మాణం
  • జీ+6, జీ+8 అంతస్తులతో రెండు టవర్లు
  • నెట్‌‌‌‌జీరో గ్రీన్ హెడ్‌‌‌‌క్వార్టర్స్ గా రూపుదిద్దికోనున్న భవనం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​శాశ్వత కార్యాలయ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌‌‌‌నగర్‌‌‌‌లో కొత్తకుంట చెరువు పక్కన 4.11 ఎకరాల విస్తీర్ణంలో రూ.169 కోట్ల అంచనా వ్యయంతో రెండు భారీ టవర్లను నిర్మించనున్నారు.  ఒక టవర్ జీ+6 అంతస్తులు, మరో టవర్ జీ+8 అంతస్తులతో రూపుదిద్దుకోనున్నాయి.

 రెండు టవర్లను అనుసంధానం చేస్తూ 2,41,540 చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక భవన సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొత్త ఆఫీసులో కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, పౌర సేవా కేంద్రాలు, ఆడిటోరియం, కమాండ్ సెంటర్‌‌‌‌తో పాటు వివిధ విభాగాలు, అనుబంధ ప్రభుత్వ సంస్థలకు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ టెండర్ల వివరాలను https://tender.telangana.gov.in/login.html వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో తెలుసుకోవచ్చని సీఎంసీ అధికారులు తెలిపారు.

నెట్​ జీరో గ్రీన్​ బిల్డింగ్ ​కాన్సెప్ట్​..

సీఎంసీ కొత్త భవనాన్ని నెట్‌‌‌‌ జీరో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌‌‌‌తో కట్టనున్నారు. ఆఫీసుకు కావాల్సిన కరెంట్ ను సోలార్ ​ప్యానెల్స్ ​ద్వారా సొంతంగా ఉత్పత్తి చేసుకుంటారు. భవనం నుంచి వెలువడే గ్రీన్‌‌‌‌హౌస్ వాయువుల పరిమాణం, అది పర్యావరణానికి చేసే మేలు సమానంగా ఉండేలా నిర్మించనున్నారు. వర్షపు నీటి సంరక్షణతో పాటు మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునే వ్యవస్థలు కూడా ఉంటాయి. సహజమైన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చేసి ఏసీలు, లైట్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిస్తారు.