హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, పరిశోధనకు సహకారం అందిస్తామని జర్మనీ ప్రతినిధుల బృందం తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార నిల్వ సదుపాయాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో భాగస్వామ్యం వహించేందుకు ఆసక్తి చూపింది. బుధవారం సెక్రటేరియెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జర్మనీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. తెలంగాణ వ్యవసాయ రంగంలో అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి జర్మనీకి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా సహకరించాలని కోరారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026లో పాల్గొని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని జర్మనీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జర్మనీ రాయబార కార్యాలయ ప్రతినిధులు వోల్కర్ క్లిమా, డాక్టర్ ఆండ్రియాస్ గ్రామ్‌జో, సబ్రినా లాండ్‌మన్ పాల్గొన్నారు.
