హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణతో పాటు దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన విశిష్ట కృషిని, రాజ్యాంగ సభ సభ్యుల అంకితభావాన్ని గవర్నర్ గుర్తుచేశారు. వారి కృషి, దూరదృష్టి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసిందన్నారు.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం అందించిన గొప్ప ఆదర్శాలని పేర్కొన్నారు. ఇవే దేశ ఐక్యత, సమగ్రత, ప్రగతికి మార్గదర్శకాలన్నారు. రాజ్యాంగం హక్కులకు భరోసా ఇవ్వడంతో పాటు దేశం పట్ల ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన విధులు, బాధ్యతలను గుర్తుచేస్తుందని తెలిపారు. ప్రజలంతా రాజ్యాంగ విలువలపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంతో పాటు యువత రాజ్యాంగ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని, ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో న్యాయబద్ధమైన, సమ్మిళిత, సామరస్యపూర్ణ, సంపన్న దేశాన్ని నిర్మించి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుందామని గవర్నర్ ఆకాంక్షించారు.
