ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలనుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులుతీరారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో మొత్తం 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 31వేల614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లోనూ పోలింగ్
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ లోఉదయం ఏడు గంటలకే ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 62 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 84 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. మేయర్ పదవి కోసం 8మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఎన్నికలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 8మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్కాపురం జిల్లాలో ఆరు మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 135 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 49 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 86 స్థానాలకు 258 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
కోనసీమలో ఎన్నికల సందడి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10 మండలాల పరిధిలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 177 గ్రామ పంచాయతీలు, 2,106 వార్డులకు నోటిఫికేషన్ విడుదల కాగా..వీటిలో 29 సర్పంచ్ స్థానాలు, 945 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 148 సర్పంచ్, 1,071 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది.
శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలసలోనూ ఎన్నికలు
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లతో పాటు ఆమదాలవలస పురపాలక సంఘంలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ 1వెయ్యి 080 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఓటింగ్ గోప్యతకు భంగం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
