- మనవడి సహాయంతో భార్యను చంపిన భర్త
- అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించి పూడ్చివేత
- శవపరీక్షతో వీడిన మిస్టరీ.. నిందితుల అరెస్టు
గంగాధర, వెలుగు : డబ్బు, బంగారంపై దురాశతో ఓ వృద్ధురాలిని అయినవారే అంతమొందించారు. భార్యను మనవడితో కలిసి భర్త దారుణంగా హతమార్చిన ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లిలో వెలుగుచూసింది. అనారోగ్యంతో మరణించిందని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేసినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. చొప్పదండి ఇన్చార్జి సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారావుపల్లికి చెందిన దోమకొండ రామయ్య, శంకరమ్మ (70) దంపతులు కుటుంబ కలహాల కారణంగా కొన్నేండ్లుగా ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. శంకరమ్మ కూలి పనులు చేస్తూ సంపాదించిన డబ్బులు తనకు ఇవ్వడం లేదని రామయ్య ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
డబ్బు ఆశజూపి మనవడిని ప్రేరేపించి..
శంకరమ్మ వద్ద ఉన్న డబ్బు, బంగారం కాజేయాలని పథకం వేసిన రామయ్య, తన మనవడికి మద్యం, సిగరెట్లు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇస్తానని ఆశ చూపి హత్యకు సహకరించేలా ఒప్పించాడు. ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామయ్య వెనుక నుంచి శంకరమ్మ నడుం భాగంలో బలంగా కొట్టి కిందపడేశాడు. మనవడు ఆమె కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోగా, రామయ్య చీరను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం శంకరమ్మ అనారోగ్యంతో రక్తం కక్కి మరణించిందని చుట్టుపక్కల వారిని నమ్మించి, మరుసటి రోజు మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
శవపరీక్షతో వీడిన హత్య మిస్టరీ
తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని శంకరమ్మ పెద్ద కుమారుడు దోమకొండ అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21న సీఐ కోటేశ్వర్, తహసీల్దార్ అంబటి రజిత, వైద్యాధికారి విజయ్ సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. విచారణలో భాగంగా భర్త రామయ్య, మనవడు నేరం అంగీకరించడంతో హత్యకు ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
