గిరిజనేతరుల భూ వివాదాలపై ఏజెన్సీ కోర్టులకు అధికారం లేదు : హైకోర్టు

గిరిజనేతరుల భూ వివాదాలపై  ఏజెన్సీ కోర్టులకు అధికారం లేదు : హైకోర్టు
  •      ఒక పక్షం గిరిజనుడైతేనే ఏజెన్సీ కోర్టుకు విచారణ: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములకు సంబంధించి గిరిజనేతరుల మధ్య ఏర్పడే వివాదాలపై ఏజెన్సీ న్యాయస్థానాలు విచారణ చేపట్టలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సమస్యలను సివిల్ కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలని తేల్చిచెప్పింది. నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో భూమికి సంబంధించిన వివాదంలో ఆర్డీవో జారీ చేసిన ఇంజంక్షన్ ఉత్తర్వులు, పోలీసు బందోబస్తు కల్పించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఎ.వెంకటయ్య మరొకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. గిరిజనుల హక్కులు, భూములు, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయవ్యవస్థ పరిధిని గిరిజనేతరుల మధ్య వివాదాలకు విస్తరించలేమని పేర్కొంది. 

వివాదంలో ఒక పక్షం గిరిజనుడైతేనే ఏజెన్సీ కోర్టుకు విచారణాధికారం ఉంటుందని తెలిపింది. ప్రస్తుత వ్యవహారంలో ఇరువర్గాలూ గిరిజనేతరులైనందున ఆర్డీవో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వకుండా ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేయడం, పోలీసు రక్షణ కల్పించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఈ కారణాలతో ఆర్డీవో జారీ చేసిన ఇంజంక్షన్, పోలీసు రక్షణ ఉత్తర్వులను కొట్టివేసింది. సివిల్ కోర్టులో కేసు వేసేందుకు వీలుగా ప్రతివాదికి సంబంధించిన పత్రాలను తిరిగి అప్పగించాలని ఆర్డీవోను ఆదేశించింది.