- అచ్చంపేటలో చేయూత పింఛన్లనూ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించే 'సంవిధాన్ రక్షా యాత్ర' ర్యాలీ, సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా పడర మండలం మద్దిమడుగులో జరిగే శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరవుతారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అచ్చంపేటకు చేరుకుని, సాయంత్రం 4.30 గంటలకు హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగ సభ వేదిక వద్దకు బయలుదేరుతారు. సాయంత్రం 5.30 గంటలకు సభా ప్రాంగణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత, ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.ఈ పర్యటనలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం రూ. 450 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో మద్దిమడుగులో రూ. 38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటు, ఆలయ నిర్మాణం, రూ. 18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి, రూ. 14 కోట్లతో అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ఐటీడీఏ భవన నిర్మాణం, రూ. 2 కోట్లతో అచ్చంపేటలో ఆదివాసీ భవన్ నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
