ముషీరాబాద్,వెలుగు: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వికసిత్ భారత్ యువ సంవాద్ 2047 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 200 మంది విద్యార్థులు పాల్గొనగా.. ముఖ్యఅతిథిగా ప్రముఖ మెజీషియన్ సామల వేణు, క్రీడా ఐకాన్ బాలగోని మహేశ్, అమృత్ పీడీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ జీవిత ప్రయాణాలు, అనుభవాలు, విజయాలను విద్యార్థులతో పంచుకుంటూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. యువత మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. యాదగిరి, ప్రిన్సిపల్ సుజనా, ఎన్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
