హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ సమస్యలకు ప్రజా రవాణా వ్యవస్థే ఏకైక శాశ్వత పరిష్కారమని ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశివర్మ అన్నారు. మెట్రో విస్తరణతో పాటు మరిన్ని బస్సులను అందుబాటులోకి తేవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో ఉన్నతస్థాయి చర్చా కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు, లండన్ అనుభవాలపై ఈ సదస్సును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా, మెట్రో రైలు) ఎన్వీఎస్ రెడ్డి నిర్వహించారు.
మూడు దశాబ్దాల క్రితం తాను హైదరాబాద్ లో పనిచేసినట్లు గుర్తుచేసుకున్న వర్మ, మళ్లీ సిటీకి వచ్చిన సందర్భంగా హైదరాబాద్ సాధించిన వృద్ధిని ప్రశంసించారు. లండన్లో ట్రాఫిక్ రద్దీ సమస్యను అధిగమించేందుకు రైలు, రోడ్లు, లండన్ అండర్ గ్రౌండ్ (మెట్రో), బస్సు, సబర్బన్ రైలు సహా 14 వేర్వేరు రవాణా సంస్థలను ట్రాన్స్ పోర్ట్ ఫర్ లండన్ పేరుతో ఒకే అథారిటీ కిందకు తెచ్చామన్నారు. ఒకప్పుడు 40 శాతానికి పైగా ఉన్న హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మోడల్ షేర్ 28 శాతానికి పడిపోవడం ఆందోళనకరమన్నారు. దీనిని 60 శాతానికి పైగా పెంచకపోతే భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీ తీవ్రం అవుతుందని హెచ్చరించారు.
