- సెక్షన్–8 కింద లాభాపేక్షలేని సంస్థగా ఏర్పాటు
- టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) కొత్త అడుగు వేసింది. వర్సిటీల్లో రీసెర్చ్, కొత్త ఆవిష్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ నిధులు సమీకరించేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (హెరిఫ్) అనే కొత్త వేదికను ప్రారంభిస్తున్నట్లు టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ప్రకటించారు. సెక్షన్–8 కింద లాభాపేక్షలేని సంస్థగా దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పరిశ్రమలు, వర్సిటీలు, ప్రభుత్వం మధ్య సమన్వయం కుదిర్చి, వర్సిటీలకు నిధులు తెచ్చేందుకు హెరిఫ్ పనిచేస్తుందని తెలిపారు. బుధవారం టీజీసీహెచ్ఈ ఆఫీసులో కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సమాజానికి జ్ఞానం.. పరిశ్రమలకు ఆవిష్కరణలు.. దేశ నిర్మాణానికి విద్య’ అనేదే హెరిఫ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మన ప్రభుత్వ వర్సిటీలను ప్రపంచ స్థాయి రీసెర్చ్ కేంద్రాలుగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని బాలకిష్టారెడ్డి చెప్పారు. ఈ ప్రయత్నం తెలంగాణ రైజింగ్–2047, వికసిత్ భారత్–2047 లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
అదనపు నిధులు అవసరం
హెరిఫ్ నిధులు ప్రభుత్వ నిధులకు బదులుగా కాకుండా, వాటికి అదనపు బలంగా ఉంటాయని బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ఆర్ నిధులతో పాటు కంపెనీలతో కలిసి చేసే రీసెర్చ్, కన్సల్టెన్సీ సర్వీసులు, కార్పొరేట్ ట్రైనింగ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, దాతల సాయం, ఎండోమెంట్లు, జాతీయ, అంతర్జాతీయ గ్రాంట్ల ద్వారా డబ్బులు సమీకరించుకోవచ్చని చెప్పారు. పేటెంట్ లైసెన్సింగ్, టెక్నాలజీ బదిలీ, స్టార్టప్‌లు ప్రభుత్వ శాఖలకు కన్సల్టెన్సీ ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 30 వేల కంపెనీలు40,794 కోట్ల సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తే, అందులో13,877 కోట్లు చదువులకే ఖర్చు చేశాయని చెప్పారు. తెలంగాణ రూ.1,445.78 కోట్లతో దేశంలో 9వ స్థానంలో ఉందన్నారు. మన దగ్గర సీఎస్ఆర్ నిధులను ఇంకా పెంచి, ప్రభుత్వం పెట్టిన రూ.2,500 కోట్ల టార్గెట్‌ను అందుకోవడానికి అందరం కలిసి పనిచేయాలని కోరారు.
హెరిఫ్ చేసే ప్రధాన పనులివే..
కంపెనీలు నిధులు, టెక్నాలజీ, రీసెర్చ్ సాయం, ఎక్స్‌పర్ట్స్ గైడెన్స్ ఇస్తాయి. వర్సిటీలు ప్రొఫెసర్ల నైపు ణ్యం, రీసెర్చ్ సామర్థ్యం, మేధో సంపత్తి, విద్యార్థుల ప్రతిభను అందిస్తాయి. ప్రభుత్వం, టీజీసీహెచ్‌ఈ కలిసి పాలసీల పరంగా గైడెన్స్, సపోర్ట్ ఇస్తాయి. మోడ్రన్ ల్యాబ్‌లు, డిజిటల్ వసతులు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, లెక్చరర్లకు ట్రైనింగ్ ఇస్తారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు హెరిఫ్ నిధులు సమీకరిస్తారు.
