ఈక్వల్ టీ20 లీగ్కు జహీర్ శ్రీకారం

ఈక్వల్ టీ20 లీగ్కు జహీర్ శ్రీకారం

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్‌‌ జహీర్‌‌ ఖాన్‌‌.. క్రికెట్‌‌ చరిత్రలో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. తన సహ-యాజమాన్యంలోని 'యాంకర్ స్పోర్ట్స్ ఏబీ' సంస్థ, జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ సంయుక్తంగా  ‘ఈక్వల్' పేరిట మిక్స్‌‌డ్-జెండర్ టీ20 లీగ్‌‌ను ప్రారంభించనున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులో జర్మనీ వేదికగా ఈ వినూత్న టోర్నీ జరగనుంది. 

మెన్స్‌‌, విమెన్స్‌‌ ప్రొఫెషనల్‌‌ క్రికెటర్లు ఒకే జట్టు తరఫున కలిసి బరిలోకి దిగడం ఈ టోర్నీ ప్రత్యేకత. ప్రతి తుది జట్టులో (ప్లేయింగ్ ఎలెవన్) ఆరుగురు విమెన్‌‌, ఐదుగురు మెన్‌‌ ప్లేయర్లు ఉంటారు. తొలి సీజన్‌‌లో మొత్తం ఐదు జట్లు తలపడనుండగా, 12 టీ20 మ్యాచ్‌‌లు నిర్వహిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీ స్క్వాడ్‌‌లో 18 మంది ఆటగాళ్లు ఉంటారు. "ప్రజలను ఏకం చేసే శక్తి క్రికెట్‌‌కు ఉంది. 

యూరప్ లాంటి వర్ధమాన మార్కెట్లలో ఈ క్రీడ విస్తరించాలంటే ఎక్కువ మందికి చేరువ చేయాలి. 'ఈక్వల్' లాంటి ప్రయత్నాలు ఆ దిశగా కీలక ముందడుగు వేస్తాయి. లింగ భేదం లేకుండా అందరూ కలిసి ఆడుతూ క్రీడాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ లీగ్ చక్కటి వేదికవుతుంది’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.