హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎస్‌టీపీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించామని గేటెడ్ కమ్యూనిటీలు చేతులు దులుపుకోరాదన్నారు. బాచుపల్లి పీఎస్పరిధిలోని దినేశ్ఆరిక్ అపార్ట్‌మెంట్, ఏపీఆర్ ఎన్‌క్లేవ్‌లో మంగళవారం ఎస్‌టీపీ ట్యాంకును శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు చనిపోగా.. ఆ ఘటనాస్థలాన్ని బుధవారం రంగనాథ్ పరిశీలించారు.
రంగనాథ్ మాట్లాడుతూ ఎస్‌టీపీల నిర్వహణ చూస్తున్న ఏజెన్సీలతో పాటు నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. త్వరలో ఎస్‌టీపీల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి రూల్స్, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పిస్తామన్నారు. నిర్వహణలో లోపాలను నివారించేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, డీఎఫ్‌వో గౌతం, ఎస్‌ఎఫ్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
